Dubai Gold Walkway: దుబాయ్‌లో బంగారు రోడ్డు.. 24 క్యారెట్ల బంగారంతో వాక్‌వే..ప్రారంభం ఎప్పుడంటే..?
దుబాయ్ పర్యాటక రంగంలో మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో గోల్డ్ వాక్‌వే ఏర్పాటు చేస్తున్నారు. 2026 చివరినాటికి దీనిని ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి, అత్యంత పొడవైన వాక్‌వేగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే నిర్మాణానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడించలేదు.
బంగారంతో చేసిన రోడ్డుపై నడిచే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. దుబాయ్‌లో అలాంటి ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బంగారు ఆభరణాల వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ నగరం, ఇప్పుడు పర్యాటకులను ఆకర్షించేందుకు మరో వినూత్న ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో గోల్డ్ వాక్‌వే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి దీనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో దుబాయ్ సందర్శించే పర్యాటకులకు ఇది మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు చెందిన వాణిజ్య విభాగం సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హర్మూది ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో వాక్‌వేను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి, అత్యంత పొడవైన గోల్డ్ వాక్‌వేగా దీనిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వాక్‌వే ఎంత పొడవు ఉంటుంది? నిర్మాణంలో ఎంత బంగారాన్ని ఉపయోగిస్తారు? దాని నిర్మాణ పద్ధతి ఏమిటి? సందర్శకులకు ప్రవేశం ఉచితమా, టికెట్ తీసుకోవాలా? అనే అంశాలపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కాబట్టి మొత్తం రహదారిని స్వచ్ఛమైన బంగారంతో నిర్మిస్తున్నారని ఇప్పుడే నిర్ధారించలేం.
మరోవైపు, దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో బంగారం, నగలు, విలువైన రాళ్లు, లగ్జరీ వాచీల వ్యాపారం కూడా విస్తరిస్తోంది. 2026 ప్రారంభం నుంచి అక్కడ కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన హోల్‌సేల్ బంగారు వ్యాపార కార్యాలయాల సంఖ్య 20 శాతం పెరిగినట్లు, కొత్త రిటైల్ దుకాణాల సంఖ్య 15 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద బంగారం, ఆభరణాల వాణిజ్య ప్రదర్శన కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా మరో ఎగ్జిబిషన్ ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ వాక్‌వే దుబాయ్ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రారంభ తేదీ, సందర్శకులకు అందించే సదుపాయాలు, ప్రవేశ నిబంధనలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.