Ebola Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా.. 10 వేల కేసులు, 5 వేల మరణాలు.. వ్యాక్సిన్ కూడా లేదు!
ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. బుండిబుగ్యో వైరస్ కారణంగా ఇప్పటివరకు 10,351 కేసులు నమోదవగా, 5,026 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. వైరస్ ఎనిమిది ప్రావిన్సులకు విస్తరించడంతో ఆరోగ్య అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతున్న ఎబోలా మహమ్మారి ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర రూపం దాల్చింది. బుండిబుగ్యో వైరస్ కారణంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 10,351 మందికి వైరస్ సోకగా, 5,026 మంది మరణించారు. అంటే మరణాల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. మరోవైపు 2,788 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల్లో ఆందోళన పెంచుతోంది.
ఈ ఏడాది మే నెల మధ్యలో బుండిబుగ్యో వైరస్ వ్యాప్తిని అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే అంచనాలకు మించి వైరస్ విస్తరించడంతో దాన్ని నియంత్రించడం కష్టంగా మారింది. 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన ఎబోలా మహమ్మారి సుమారు 11 వేల మందిని బలిగొంది. ఆ తర్వాత చరిత్రలో అత్యధిక మరణాలకు కారణమైన రెండో అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా ప్రస్తుత పరిస్థితి నిలిచింది. ఈ విషాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రోగ్రామ్ ఏరియా మేనేజర్ డాక్టర్ పాట్రిక్ ఓటిమ్ స్పందిస్తూ.. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, వేలాది కుటుంబాలు, సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగోలోని 26 ప్రావిన్సుల్లో ఎనిమిది ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. మొత్తం 178 ఆరోగ్య మండలాల్లో 67 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటూరి, నార్త్ కివు ప్రావిన్సుల్లో వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనే కలిపి 9,782 కేసులు, 4,792 మరణాలు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడం, వారికి పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త కేసుల్లో దాదాపు 80 శాతం ఇప్పటికే అధికారుల పర్యవేక్షణలో ఉన్న కాంటాక్ట్ జాబితాలో లేని వ్యక్తుల్లోనే బయటపడుతున్నాయి. అంతేకాకుండా నమోదైన మరణాల్లో మూడో వంతు మంది ఆసుపత్రులకు చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నట్లు WHO అధికారి వెల్లడించారు.
మరోవైపు కాంగో తూర్పు ప్రాంతాల్లో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు కూడా ఎబోలా నియంత్రణకు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వ బలగాలు, ఎం23 సహా పలు సాయుధ గ్రూపుల మధ్య పోరాటాలతో వైద్య సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టమవుతోంది. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించడం వంటి చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. బుండిబుగ్యో వైరస్‌కు ప్రస్తుతం నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. రోగుల్లో కనిపించే లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కాంగో అధికారులకు పెద్ద సవాలుగా మారింది.