Cross Falls: చర్చిలో ప్రసంగిస్తుండగా ఊహించని ప్రమాదం.. ఫాదర్‌పై పడిన ఏసు క్రీస్తు శిలువ.. ఆ తర్వాత..!
ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్చిలో భక్తులకు ప్రసంగిస్తున్న ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడ్ సాంచెజ్ మొలినారి వెనుక గోడపై అమర్చిన భారీ చెక్క శిలువ ఆయనపై పడటంతో ప్రాణాలు కోల్పోయారు.
మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అంతా సజావుగా సాగిపోతోందనుకునే సమయంలోనే ఊహించని ఘటనలు జీవితాలను తలకిందులు చేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి విషాదకర ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. చర్చిలో భక్తులను ఉద్దేశించి ప్రార్థనలు నిర్వహిస్తున్న ఓ క్యాథలిక్ మతగురువు అనూహ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్‌లో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. పెర్పెట్యూయో సోకోరో పారిష్‌కు చెందిన ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడ్ సాంచెజ్ మొలినారి చర్చిలో క్రీస్తు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆయన వెనుక గోడ పైభాగంలో అమర్చిన ఏసు క్రీస్తు చెక్క శిలువ అకస్మాత్తుగా కిందకు పడింది.
ఆ భారీ శిలువ నేరుగా మతగురువుపై పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఫాదర్ మొలినారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెల్లడించాయి. కాసేపటి క్రితం వరకు భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన ఆయన ఇలా ప్రమాదంలో మరణించడం చర్చికి వచ్చిన వారిని విషాదంలో ముంచెత్తింది. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చర్చిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం పలువురిని కలచివేస్తోంది. అయితే శిలువ కిందపడటానికి గల ఖచ్చితమైన కారణం ఏమిటనే విషయం అందుబాటులో ఉన్న వివరాల్లో స్పష్టంగా వెల్లడికాలేదు.
ఫాదర్ మొలినారి మరణాన్ని గ్వాయాకిల్ ఆర్చిడియోసెస్ ఆదివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది. సెంట్రల్ వికారియేట్ పరిధిలోని అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చిలో ఆయన పారిష్ ప్రీస్ట్‌గా సేవలందిస్తున్నారని పేర్కొంది. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రభువు ఆయనకు శాశ్వత విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థించింది.
ప్రార్థనలు, ఆధ్యాత్మిక సేవలతో భక్తులకు దగ్గరైన ఫాదర్ మొలినారి ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సాధారణంగా చర్చిల్లో గోడలకు లేదా పైభాగాల్లో అమర్చే భారీ వస్తువులను పటిష్టంగా ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అయితే ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.