వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Price Hike: సామాన్యుడికి మరో షాక్.. గుడ్ల ధరలు కొండెక్కుతున్నాయ్.. డజను త్వరలో రూ.100 దాటుతుందా..?

Price Hike

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో డజను గుడ్ల ధర రూ.80 ఉండగా.. ప్రస్తుతం కొన్ని రిటైల్ మార్కెట్లలో రూ.96 వరకు చేరింది. దాణా, మొక్కజొన్న ధరలు పెరగడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. బియ్యం, వంటనూనె, పంచదార, కూరగాయల ధరలు ఇప్పటికే పెరగడంతో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులవుతున్నాయి. ఇప్పుడు తక్కువ ధరలో లభించే పోషకాహారంగా భావించే కోడిగుడ్డు కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. గత మూడు నెలలుగా దాదాపు స్థిరంగా కొనసాగిన గుడ్ల ధరలు.. గత కొద్ది రోజులుగా ఒక్కసారిగా పెరుగుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో గతంలో డజను గుడ్ల ధర రూ.80 ఉండగా.. నాలుగైదు రోజుల క్రితం రూ.90కి చేరింది. ప్రస్తుతం కొన్ని రిటైల్ మార్కెట్లలో డజను ధర రూ.96 వరకు పలుకుతోంది. అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే డజనుపై రూ.16 మేర పెరుగుదల నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే డజను గుడ్ల ధర రూ.100 మార్కును తాకే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గుడ్ల ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దాణా ఖర్చులు పెరగడం, మొక్కజొన్న ధరలు అధికం కావడం కోళ్ల పెంపకంపై భారాన్ని పెంచుతున్నాయని వివరిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. హోల్‌సేల్ ధరలు పెరగడంతో వాటి ప్రభావం చిల్లర మార్కెట్లపైనా పడుతోంది. గతంలో ఒక్కో గుడ్డు రూ.6 నుంచి రూ.7 మధ్య లభించగా.. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సూచించిన హోల్‌సేల్ ధరల ప్రకారం నవంబర్ 13 నాటికి హైదరాబాద్‌లో 100 గుడ్ల ధర రూ.640గా ఉండగా.. విశాఖపట్నంలో రూ.625గా నమోదైంది. మరోవైపు రిటైల్ మార్కెట్‌లో నగరాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో డజను గుడ్ల ధర సుమారు రూ.86 ఉండగా.. విజయవాడలో రూ.80 వరకు పలుకుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ల ధరల పెరుగుదల మరో భారంగా మారింది. ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం అందించేందుకు రోజూ గుడ్లు కొనుగోలు చేసే కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కార్తీక మాసం కావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో గుడ్లకు డిమాండ్ పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ ధరలు మాత్రం పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం రూ.80 నుంచి రూ.96 మధ్య ఉన్న డజను గుడ్ల ధర.. త్వరలోనే రూ.100కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.