తాటిచెట్టుకు నిప్పు పెట్టిన రైతు.. మంటల్లో చిక్కుకుని నాలుగు కోతులు మృతి!
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులను తరిమేందుకు ఓ రైతు తాటిచెట్టుకు నిప్పు పెట్టడంతో నాలుగు కోతులు మంటల్లో చిక్కుకుని మృతి చెందాయి. మరో కోతి గాయపడటంతో గ్రామస్థులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
కోతులను తరిమేందుకు ఓ రైతు తాటిచెట్టుకు నిప్పు పెట్టడంతో నాలుగు వానరాలు మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మరో కోతి తీవ్రంగా గాయపడటంతో గ్రామస్థులు దానిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మూగజీవాల మరణానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కోతులను తరిమేందుకు చెట్టుకు నిప్పు: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామ శివారులోని ఓ తాటిచెట్టుపైకి కొన్ని కోతులు ఎక్కాయి. వాటిని గమనించిన గ్రామానికి చెందిన ఓ రైతు కోతులను తరిమేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా చెట్టు కింద కుక్కలను కాపలాగా ఉంచి, తాటిచెట్టుకు నిప్పు పెట్టినట్లు స్థానికులు తెలిపారు.
దీంతో చెట్టుపై ఉన్న కోతుల్లో కొన్ని అక్కడి నుంచి తప్పించుకోగా.. మరో నాలుగు కోతులు పొగ, మంటల్లో చిక్కుకున్నాయి. బయటకు వచ్చే మార్గం లేక మంటల తీవ్రతకు నాలుగు వానరాలు మృతి చెందాయి. మరో కోతి గాయపడటంతో గ్రామస్థులు దానిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. కోతులను తరిమేందుకు చెట్టుకు నిప్పు పెట్టి మూగజీవాల మరణానికి కారణం కావడంపై గ్రామస్థులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సదరు రైతుకు ఆ ప్రాంతంలో ఎలాంటి పంట భూములు కూడా లేవని స్థానికులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు వానరాలను తరిమేందుకు చెట్టుకు నిప్పు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మూగజీవాల పట్ల ఇలాంటి చర్యలు అమానవీయమని పేర్కొంటూ, ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో చిట్టాపూర్ గ్రామంలో చర్చ మొదలైంది. కోతులను తరిమేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించకుండా నిప్పు పెట్టడం వల్ల నాలుగు వానరాలు ప్రాణాలు కోల్పోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూగజీవాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వాటిని తరిమేందుకు హానికరమైన పద్ధతులను ఉపయోగించకూడదని స్థానికులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.