బిస్లెరి వాటర్‌పై FSSAI సంచలన నిర్ణయం.. నాణ్యత పరీక్షల్లో విఫలం.. కంపెనీపై కేసుకు అనుమతి!
బిస్లెరి ఇంటర్నేషనల్‌కు FSSAI షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా రెండు దశల ల్యాబ్ పరీక్షల్లోనూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. నీటిలో బ్రోమేట్ స్థాయులు అధికంగా ఉండటంతో పాటు PAHs ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కంపెనీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు FSSAI అనుమతి ఇచ్చింది. అయితే, కంపెనీ దోషిగా తేలినట్లు కాదు.. తుది నిర్ణయం కోర్టు విచారణలో వెలువడుతుంది.
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన తాగునీటి నమూనా నాణ్యత పరీక్షల్లో విఫలమైందని పేర్కొంటూ, బిస్లెరి ఇంటర్నేషనల్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 కింద కంపెనీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ప్యాకేజ్డ్ వాటర్ వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారింది.
FSSAI వివరాల ప్రకారం.. బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రాంగణం నుంచి సాధారణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ మినహా) నమూనాను అధికారులు సేకరించి పరీక్షలకు పంపించారు. తొలి దశలో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఆ నీటిలో బ్రోమేట్ స్థాయులు నిర్దేశించిన పరిమితులకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ఆ నమూనాను సురక్షితం కాని నీటిగా అధికారులు ప్రకటించారు.
అయితే, ఈ పరీక్ష ఫలితాలపై కంపెనీ అప్పీల్ చేసుకుంది. దీంతో అదే నమూనాను మరింత పరిశీలన కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన రెండో పరీక్షలోనూ ఆ నీరు సురక్షితం కాదని తేలింది. ఈసారి పరీక్షల్లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించారు. ఈ ఫలితాలు ఆహార భద్రతా చట్టం కింద నిబంధనల ఉల్లంఘనగా పరిగణించినట్లు FSSAI తెలిపింది.
ఈ నేపథ్యంలో బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన విచారణ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే కంపెనీ దోషిగా తేలినట్లు కాదు. కోర్టు విచారణలోనే తుది నిర్ణయం వెలువడుతుంది.
ఈ ఘటనతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై మరోసారి దృష్టి పడింది. అయితే, ఏ బ్యాచ్ లేదా ఏ ఉత్పత్తి వేరియంట్ నమూనాలో ఈ సమస్య గుర్తించారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. అలాగే, దేశవ్యాప్తంగా బిస్లెరి ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలనే రీకాల్ ఆదేశం కూడా ప్రకటించలేదు.