వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వ్యాపారం | రచన: Pallavi |

Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారా? బ్యాంకుల నుంచి ఈ నోటీసులు రావచ్చు!

బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారా?

బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్ నోటీసులు వస్తున్నాయి. తాకట్టు పెట్టిన బంగారం విలువ తగ్గడంతో లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి పెరుగుతోంది. దీంతో రుణగ్రహీతలు అదనపు నగదు చెల్లించాల్సి రావచ్చు లేదా మరికొంత బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి రావచ్చు.

బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుదారులు సంతోషపడుతుంటే.. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారికి మాత్రం కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పసిడి ధరలు భారీగా పడిపోవడంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) అప్రమత్తమయ్యాయి. బంగారం విలువ తగ్గడంతో రుణాలకు భద్రతగా ఉన్న ఆభరణాల విలువ సరిపోకపోవచ్చనే ఉద్దేశంతో కొంతమంది కస్టమర్లకు మార్జిన్ కాల్ నోటీసులు పంపిస్తున్నాయి. అదనంగా నగదు చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తాకట్టు పెట్టాలని సూచిస్తున్నాయి. 2026 జనవరిలో గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు నవంబర్ నాటికి గణనీయంగా తగ్గాయి. జనవరి గరిష్ఠ ధరలతో పోలిస్తే దేశీయ మార్కెట్లో పసిడి ధరలు సుమారు 26 శాతం నుంచి 35 శాతం వరకు పడిపోయినట్లు వివిధ నివేదికలు వెల్లడించాయి. దీంతో గతంలో అధిక బంగారం విలువ ఆధారంగా రుణాలు తీసుకున్నవారిపై ఒత్తిడి పెరుగుతోంది. లోన్ టు వ్యాల్యూ (LTV) అంటే ఏమిటి? బంగారు ఆభరణాల విలువ ఆధారంగా బ్యాంకులు ఎంత మొత్తంలో రుణం ఇవ్వాలనేది నిర్ణయించే విధానాన్ని లోన్ టు వ్యాల్యూ రేషియో అంటారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణ మొత్తాన్ని బట్టి ఈ పరిమితులు ఉంటాయి. - రూ.2.5 లక్షల వరకు రుణానికి గరిష్ఠంగా 85 శాతం. - రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం. - రూ.5 లక్షలకు పైబడిన రుణాలకు 75 శాతం. మార్జిన్ కాల్ నోటీసులు ఎందుకు వస్తాయి? ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1 లక్ష విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టి 75 శాతం ఎల్‌టీవీ ప్రకారం రూ.75 వేల రుణం తీసుకున్నారనుకుందాం. కొంతకాలానికి బంగారం ధర 20 శాతం తగ్గితే దాని విలువ రూ.80 వేలకు పడిపోతుంది. కానీ తీసుకున్న రుణం, వడ్డీ మాత్రం అలాగే ఉంటాయి. దీంతో ఎల్‌టీవీ నిష్పత్తి పెరుగుతుంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి బ్యాంకులు కొంత రుణాన్ని తిరిగి చెల్లించాలని లేదా అదనపు బంగారం తాకట్టు పెట్టాలని కోరవచ్చు. నోటీసులు వస్తే ఏం చేయాలి? బ్యాంకు నుంచి మార్జిన్ కాల్ నోటీసు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత శాఖను సంప్రదించాలి. బకాయి మొత్తం, ప్రస్తుత బంగారం విలువ, అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని తెలుసుకోవాలి. వీలైతే కొంత రుణాన్ని తిరిగి చెల్లించడం లేదా అదనపు బంగారం తాకట్టు పెట్టడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మార్జిన్ కాల్ వచ్చినంత మాత్రాన వెంటనే బంగారాన్ని వేలం వేస్తారని భావించకూడదు. అయితే నోటీసులో ఇచ్చిన గడువులోగా స్పందించకపోతే నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే గోల్డ్ లోన్ తీసుకున్నవారు బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలు, నోటీసులను నిర్లక్ష్యం చేయకూడదు.