బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. ఇప్పుడు కొనాలా? ఇంకా తగ్గుతాయా? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లపై అంచనాల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో ప్రస్తుతం కొనుగోలు చేయాలా లేదా మరికొంత కాలం వేచి చూడాలా అనే సందేహం ఇన్వెస్టర్లలో నెలకొంది. నిపుణుల సూచన ప్రకారం మార్కెట్ స్థిరపడే వరకు వేచి ఉండటం, దీర్ఘకాలిక పెట్టుబడులకు విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిది.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల వరకు భారీగా పెరిగిన ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 20న దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర 4 శాతానికి పైగా, వెండి ధర 6 శాతానికి పైగా తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలా? లేక మరికొంత కాలం వేచి చూడాలా?
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కూడా బంగారం, వెండిపై ఒత్తిడి పెంచుతున్నాయి. వడ్డీ ఆదాయం అందించని బంగారం, వెండి కంటే అధిక రాబడులు ఇచ్చే పెట్టుబడుల వైపు కొందరు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. నవంబర్ 20 ఉదయం ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,21,663కు పడిపోయింది. వెండి ధర కిలోకు రూ.1,47,464కు చేరింది.
ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉంది? మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం బంగారానికి రూ.1,22,000 నుంచి రూ.1,22,800 మధ్య కీలక మద్దతు స్థాయి ఉంది. ఈ స్థాయి కంటే దిగువకు పడితే రూ.1,18,000-1,19,000 వరకు తగ్గే అవకాశం ఉంది. వెండికి రూ.1,48,000-1,50,000 మధ్య మద్దతు ఉంది. ఇది కోల్పోతే రూ.1,40,000-1,42,000 స్థాయులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా? ధరలు తగ్గాయని వెంటనే భారీగా కొనుగోలు చేయడం సరైన నిర్ణయం కాకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్నవారు ఒకేసారి మొత్తం డబ్బు పెట్టకుండా విడతల వారీగా కొనుగోలు చేయవచ్చు. వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మరింత జాగ్రత్త అవసరం.
గమనిక: ఇవి మార్కెట్ పరిస్థితులు, నిపుణుల అంచనాల ఆధారంగా అందించిన వివరాలు మాత్రమే. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక సలహాదారును సంప్రదించండి.