Guntur: అప్పు విషయంలో గొడవ.. మద్యం తాగి వెళ్లి దారుణం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
గుంటూరులో అప్పు విషయంలో తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. తీసుకున్న రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించాలంటూ అడగడంతో రుణగ్రహీత తన స్నేహితులతో కలిసి అప్పు ఇచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు.
గుంటూరులో అప్పు విషయంలో తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. తీసుకున్న రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించాలంటూ అడగడంతో రుణగ్రహీత తన స్నేహితులతో కలిసి అప్పు ఇచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నాగరాజు ప్రాణాలు కోల్పోగా, నిందితులు చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వెంగళాయపాలెం టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో నివసించే యశ్వంత్ కుటుంబ అవసరాల కోసం తనకు తెలిసిన నాగరాజు వద్ద రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బును సమయానికి తిరిగి ఇవ్వలేకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అప్పు చెల్లించాలంటూ నాగరాజు అడగడం, ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో యశ్వంత్ అసహనానికి గురయ్యాడు. తనకు ఎదురవుతున్న పరిస్థితిని స్నేహితులైన మనోజ్, సుభాష్, అశోక్‌లకు వివరించాడు. నాగరాజుపై కక్ష పెంచుకున్న వీరంతా కలిసి అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పలకలూరు రోడ్డులోని స్వగ్రుహా హైట్స్‌లో నివసించే నాగరాజు ఫోన్ పే సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతడి భార్య, పిల్లలు విజయవాడలోని అత్తవారింట్లో ఉండటంతో వారిని తీసుకురావడానికి వెళ్తున్నానని తండ్రికి చెప్పి గత నెల 20న బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. భార్య, పిల్లల వద్దకు కూడా వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి నతానియేలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 22న పలకలూరి రోడ్డులో నాగరాజు మృతదేహాన్ని గుర్తించారు. అతడి సెల్‌ఫోన్, బైక్ కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు హత్య కేసుగా పరిగణించి దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలో యశ్వంత్, అతడి ముగ్గురు స్నేహితులు పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించారు.
అప్పు తిరిగి ఇవ్వాలని నాగరాజు అడగడంతోనే అతడిని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. గత నెల 20న నలుగురూ మద్యం సేవించి నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద నాగరాజు ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అతడితో గొడవపడి బీరు బాటిళ్లతో దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అతడి సెల్‌ఫోన్, బైక్‌ను తీసుకుని వెళ్లిపోయినట్లు పోలీసులకు తెలిపారు. నేరం అంగీకరించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేవలం అప్పు విషయంలో ఏర్పడిన వివాదం ఒక వ్యక్తి హత్యకు దారితీయడం గుంటూరులో చర్చనీయాంశంగా మారింది.