జనవరి 1 నుంచి రూ.500లోపు UPI చెల్లింపులకు SMS అలర్ట్స్ బంద్.. కస్టమర్లకు కీలక సూచన!
2027 జనవరి 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్ నిలిచిపోనున్నాయి. రూ.500 కంటే ఎక్కువ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి. అయితే అన్ని లావాదేవీలకు ఈమెయిల్ నోటిఫికేషన్లు అందుబాటులో ఉంటాయి.
డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. టీ కొట్టులో టీ తాగినా, కూరగాయలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా చాలామంది యూపీఐ (UPI) ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఫోన్లో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా క్షణాల్లో డబ్బులు పంపిస్తున్నారు. ఇలా ప్రతి లావాదేవీ జరిగిన వెంటనే బ్యాంకు నుంచి వచ్చే ఎస్ఎంఎస్ ద్వారా డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యాయో లేదో తెలుసుకుంటున్నారు. అయితే హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ కస్టమర్లకు త్వరలో ఈ విషయంలో కీలక మార్పు రానుంది.
జనవరి 1 నుంచి కొత్త నిబంధన: 2027 జనవరి 1 నుంచి రూ.500 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో చేసే యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిలిపివేయనుంది. అంటే మీరు రూ.50, రూ.100, రూ.200, రూ.400 లేదా రూ.500తో యూపీఐ చెల్లింపులు చేసినా ఇకపై బ్యాంకు నుంచి సాధారణ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ రాకపోవచ్చు. అయితే రూ.500 కంటే ఎక్కువ మొత్తంతో చేసే యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎప్పటిలాగే ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుతాయి.
ఎస్ఎంఎస్ అలర్ట్స్ నిలిపివేస్తున్నప్పటికీ కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఈమెయిల్ అలర్ట్స్‌ను బ్యాంక్ కొనసాగించనుంది. మీరు ఎంత మొత్తంతో చెల్లింపు చేసినా మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి లావాదేవీ వివరాలు వస్తాయి. ఈ సేవ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించిన మార్గదర్శకాల ప్రకారం రూ.500 కంటే ఎక్కువ విలువైన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు తక్షణ ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం బ్యాంకులకు తప్పనిసరి. రూ.500 లేదా అంతకంటే తక్కువ లావాదేవీలకు ఎస్ఎంఎస్ పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా బ్యాంకుల విధానాలకు వదిలేశారు. అయితే అలాంటి లావాదేవీలకు ఎస్ఎంఎస్ పంపితే కస్టమర్ల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ మార్పును అమలు చేయనుంది.
కస్టమర్లు ఏం చేయాలి?
ఈ కొత్త విధానం అమల్లోకి రాకముందే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఈమెయిల్ ఐడీని ఒకసారి తనిఖీ చేసుకోవాలి. పాత ఈమెయిల్ ఐడీ ఉంటే లేదా మార్పులు చేయాల్సి ఉంటే బ్యాంకు అధికారిక యాప్, నెట్ బ్యాంకింగ్ లేదా సమీప శాఖను సంప్రదించి అప్డేట్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులకు ఎస్ఎంఎస్ రాకపోయినా మీ చెల్లింపుల సేవలు యథావిధిగా కొనసాగుతాయి. లావాదేవీ వివరాలను యూపీఐ యాప్, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా ఈమెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి హెచ్డీఎఫ్సీ కస్టమర్లు ఈ మార్పును ముందుగానే గమనించి తమ ఈమెయిల్ వివరాలను సరిచూసుకోవడం మంచిది.