Health Tips: గుండెపోటు ముప్పు పెంచే 3 అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారంటే జాగ్రత్త..!
ఈ రోజుల్లో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు యువతలోనూ బయటపడుతున్నాయి.
ఈ రోజుల్లో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు యువతలోనూ బయటపడుతున్నాయి. దీనికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాలు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మనం పెద్దగా పట్టించుకోని కొన్ని రోజువారీ అలవాట్లు కూడా గుండెపై ఒత్తిడి పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెను కాపాడుకోవాలంటే ముఖ్యంగా మూడు అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మొదట ఆహారం విషయంలో నియంత్రణ అవసరం. ఆకలి తీర్చుకోవడానికి తరచూ ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్, ప్యాకెట్ చిరుతిళ్లు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాలక్రమంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగకపోవచ్చు. రుచికరమైన ఆహారం తినడం తప్పు కాదు కానీ, పోషకాలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే నిద్ర విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ వేర్వేరు సమయాల్లో నిద్రపోవడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం, నిద్ర సరిపోకపోవడం వల్ల శరీర జీవ గడియారం దెబ్బతింటుంది. ఈ ప్రభావం రక్తపోటు, హార్మోన్ల పనితీరు, గుండె స్పందనపై పడే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర, మేల్కొనే సమయాలను క్రమబద్ధీకరించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.
ఇక మూడో అలవాటు ధూమపానం. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులే కాకుండా గుండె, రక్తనాళాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. సిగరెట్‌లో ఉండే విషపూరిత పదార్థాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. రక్తనాళాలు కుచించుకుపోవడం, రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరగడం వంటి పరిణామాలు గుండెకు ప్రమాదకరంగా మారవచ్చు. రోజుకు ఒకటి, రెండు సిగరెట్లే తాగుతున్నామని అనుకునేవారు కూడా దీన్ని తేలికగా తీసుకోకూడదు. తక్కువ మొత్తంలో పొగతాగినా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సిగరెట్ అలవాటును పూర్తిగా మానేయడం అత్యంత కీలకం.
ఈ మూడు అలవాట్లను మార్చుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన దినచర్యను కొనసాగించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు. రోజూ కొంత సమయం నడకకు కేటాయించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట తగినంత నిద్రపోవడంతో పాటు రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. మరోవైపు బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం కూడా అవసరం. చిన్న చిన్న మార్పులు ఇప్పుడే చేసుకుంటే భవిష్యత్తులో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.