విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని తాకిన మంటలు.. అసలేం జరిగిందంటే?
విశాఖపట్నంలోని HPCL ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సల్ఫర్ ప్లాంట్ సమీపంలోని పిచ్ ట్యాంక్ వద్ద పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంక్ వద్ద పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే భారీగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రిఫైనరీలోని సల్ఫర్ యూనిట్ సమీపంలో ఉన్న పిచ్ ట్యాంక్ వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా ఏర్పాటు చేసిన సల్ఫర్ ప్లాంట్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
మంటలు భారీగా ఎగసిపడటంతో మల్కాపురం, శ్రీహరిపురం పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై మరింత చర్చ జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే HPCL అంతర్గత అగ్నిమాపక బృందాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మంటలు ట్యాంక్కే పరిమితమయ్యాయని, రిఫైనరీలోని ఇతర విభాగాలకు ప్రమాదం లేదని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.