వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

రూ.9 కోట్ల మందు కేవలం రూ.2.5 లక్షలకే.. ఏడుగురు చిన్నారులకు హైదరాబాద్ డాక్టర్ గొప్ప సాయం!

shivaranjani

హైదరాబాద్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ ప్రయత్నంతో అరుదైన AHDS వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కోట్ల రూపాయల విలువైన టిరాట్రికోల్ మందును ఏడాది పాటు ఉచితంగా అందించనున్నారు. విదేశీ సంస్థల సహకారంతో ఏడాది చికిత్స ఖర్చును ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షలకు తగ్గించారు.

ప్రాణాలు నిలబెట్టే మందు అందుబాటులో ఉన్నా.. దాని ధర కోట్ల రూపాయల్లో ఉంటే సామాన్య కుటుంబాలు ఏం చేయాలి? తమ బిడ్డకు చికిత్స చేయించాలనే ఆశ ఉన్నా, అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేక నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి కుటుంబాలకు హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ అండగా నిలిచారు. ఏడాదికి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే అరుదైన వ్యాధి ఔషధాన్ని అంతర్జాతీయ సంస్థల సహకారంతో సుమారు రూ.2.5 లక్షలకే అందించే మార్గాన్ని కనుగొన్నారు. అంతేకాదు, ఈ మందును ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలన్-హెర్న్డన్-డడ్లీ సిండ్రోమ్ (AHDS) లేదా ఎంసీటీ8 లోపం అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు టిరాట్రికోల్ అనే ఔషధం ఉపయోగిస్తారు. అయితే ఈ మందు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఒక్క చిన్నారికి ఏడాది చికిత్స చేయించాలంటే సుమారు రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంతటి భారాన్ని భరించడం చాలా కుటుంబాలకు అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో డాక్టర్ శివరంజని, యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా ప్రతినిధి కె.ఎం. గోపకుమార్ కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ (PAF), ది హేగ్‌లోని ట్రాన్స్‌వాల్ ఫార్మసీ సహకారంతో ప్రత్యామ్నాయంగా మందును తయారు చేసే మార్గం దొరికింది. దీంతో ఏడాది చికిత్స ఖర్చును ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షలకు తగ్గించగలిగారు. ఈ ప్రయత్నానికి అరవ్ అనే చిన్నారి పరిస్థితి ప్రధాన కారణమైంది. డాక్టర్ శివరంజని వద్ద చికిత్స పొందుతున్న అరవ్‌కు ఈ అరుదైన వ్యాధి నిర్ధారణ కావడంతో, అతనికి మందు అందించేందుకు తల్లి పవిత్ర సిరోల్కర్ ఎంతో కష్టపడ్డారు. జర్మనీ నుంచి ఒక నెలకు సరిపడా మందు తెప్పించడానికే రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఖర్చుతో నిరంతర చికిత్స సాధ్యం కాదని గుర్తించిన డాక్టర్ శివరంజని ఔషధ కంపెనీలను సంప్రదించారు. ఉచిత మందుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సెప్టెంబర్ 7న సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు. అది నెదర్లాండ్స్‌కు చెందిన PAF దృష్టికి వెళ్లడంతో సహకారం లభించింది. మొదట అరవ్‌తో పాటు వెల్లూరులోని సీఎంసీలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు చిన్నారులను గుర్తించగా, తర్వాత మరో చిన్నారి కుటుంబం సంప్రదించడంతో మొత్తం ఏడుగురికి మందులు అందించే ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 30 నుంచి మందుల పంపిణీ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ శివరంజని క్లినిక్‌లో ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు మొదటి విడత మందులు అందజేయనుండగా, మిగిలిన ఐదుగురికి బెంగళూరులో పంపిణీ చేయనున్నారు. మందులను ఆరు నెలల వరకు మాత్రమే నిల్వ ఉంచే అవకాశం ఉండటంతో రెండు విడతల్లో దిగుమతి చేస్తున్నారు. ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు చికిత్స అందించేందుకు మొత్తం 14,200 యూరోలు, భారత కరెన్సీలో దాదాపు రూ.15.08 లక్షలు ఖర్చవుతుందని PAF వెల్లడించింది. ఇందులో డాక్టర్ శివరంజని భారత్‌లో రూ.6.09 లక్షలు సమకూర్చగా, మిగిలిన రూ.9.13 లక్షలను నెదర్లాండ్స్‌లో PAF సేకరించింది. ఈ నిధుల ద్వారా ఏడుగురికి ఏడాది పాటు మందులను ఉచితంగా అందించనున్నారు. AHDS అనేది MCT8 జన్యువులో మార్పుల వల్ల వచ్చే వ్యాధి. థైరాయిడ్ హార్మోన్లు మెదడులోని కణాలకు సరిగ్గా చేరకపోవడంతో నాడీ వ్యవస్థ అభివృద్ధి, శారీరక ఎదుగుదల దెబ్బతింటాయి. కండరాల బలహీనత, అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యలు రావచ్చు. టిరాట్రికోల్ ఈ వ్యాధి ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఏడుగురు చిన్నారులకు మందులు అందుబాటులోకి రావడంతో తాత్కాలికంగా ఊరట లభించినా, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే శాశ్వత పరిష్కారం కాదని డాక్టర్ శివరంజని భావిస్తున్నారు. ఈ ఔషధాన్ని భారత్‌లోనే కాంపౌండింగ్ విధానంలో తయారు చేసి మరింత మంది బాధితులకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా, ఇతర సంస్థలతో కలిసి ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పీడియాట్రిషియన్లు, ఎండోక్రైనాలజిస్టులు, పీడియాట్రిక్ న్యూరాలజిస్టులను సంప్రదిస్తూ ఈ వ్యాధితో బాధపడుతున్న మరిన్ని చిన్నారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్నారి చికిత్స కోసం మొదలైన ఈ పోరాటం ఏడుగురికి ఉచిత మందులు అందించే స్థాయికి చేరగా, భవిష్యత్తులో దేశంలోని మరెందరో పిల్లలకు ఈ ఔషధం అందుబాటులోకి రావాలన్నదే ఆమె ఆశయం.