వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Pallavi |

హైదరాబాద్‌లో తాగునీటి కొరత.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

హైదరాబాద్‌లో తాగునీటి కొరత..

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నవంబర్ 1 నుంచి భవన నిర్మాణ పనులకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్కులు, రోడ్ల శుభ్రత, పచ్చదనం నిర్వహణకు కూడా ఈ నీటిని ఉపయోగించనున్నారు. ఎస్టీపీల పనితీరును హైడ్రా పర్యవేక్షించనుండగా, తాగునీటి వృథాను తగ్గించి నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం.

హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తాగునీటిని పొదుపుగా వినియోగించేలా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో తాగునీటి వినియోగాన్ని తగ్గించి, శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించేలా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 28న అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) 100 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భవన నిర్మాణ పనుల్లో శుద్ధి చేసిన నీటినే వినియోగించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కొత్త ఆదేశాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో పచ్చదనం నిర్వహణకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. పబ్లిక్ పార్కుల నిర్వహణ, రోడ్ల శుభ్రత, మెట్రో రైలు వంటి సంస్థల అవసరాలకు కూడా ఈ నీటిని వినియోగించాలని ఆదేశించారు. డేటా సెంటర్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంతో పాటు, ప్రైవేట్ సంస్థలు ఎస్టీపీలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ప్లాంట్ వద్ద ప్రత్యేక అధికారిని నియమించి, అన్ని కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. ఎస్టీపీల పనితీరును హైడ్రా నిరంతరం పర్యవేక్షించనుంది. శుద్ధి చేసిన నీటిని తరలించే ట్యాంకర్ల ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని 26 ఎస్టీపీల నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని ఉచితంగా అందిస్తుండగా, వినియోగదారులు రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తున్నారని జలమండలి అధికారులు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా, నగరంలో నిరంతర నీటి సరఫరాను కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.