వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

నేర వార్తలు | రచన: Kalyan |

Fake Currency: పెద్ద స్కెచ్చే వేశారు.. ఇంట్లోనే నకిలీ నోట్ల ముద్రణ.. ఏకంగా రూ.6.78 కోట్లు పట్టివేత..!

Fake Currency

హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో పోలీసులు భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు. కుంట్లూర్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్ యూనిట్‌పై దాడి చేసి రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసిన వారు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాలని ప్లాన్ చేశారు. అందుకోసం ఏకంగా నకిలీ కరెన్సీ తయారీనే వృత్తిగా ఎంచుకున్నారు. రూ.500 నోట్లను అచ్చం అసలు నోట్ల మాదిరిగానే ముద్రించి మార్కెట్లో చలామణి చేయాలని భారీ స్కెచ్ వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్యంగా ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. అయితే వీరి బాగోతం చివరకు పోలీసులకు తెలిసిపోయింది. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో ఈ ముఠా గుట్టును వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కారును ఆపి తనిఖీ చేయగా అందులో రూ.8 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు బయటపడ్డాయి. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు బాగోతం బయటపడింది. పెద్దఅంబర్‌పేట సమీపంలోని కుంట్లూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీతో పాటు ప్రింటింగ్ యంత్రాలు, స్కానర్లు, నకిలీ నంబర్ ప్లేట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితులు గతంలో ఒకే సంస్థలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా సమాచారం సేకరించి నకిలీ నోట్ల తయారీకి ప్లాన్ చేశారు. ముంబయి, గుజరాత్ ప్రాంతాల నుంచి ఖరీదైన ప్రింటింగ్ యంత్రాలను కొనుగోలు చేసి, ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక కాగితాన్ని తెప్పించారు. అనంతరం రూ.500 నోట్లను పోలిన నకిలీ కరెన్సీని పెద్ద మొత్తంలో ముద్రించారు. ఈ వ్యవహారంలో మడుపోజు కరుణాకర్, చిన్నోళ్ల మాణిక్యరెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి, కరణం అజయ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. జెల్లి వెంకటేష్, కుంజ బాలరాజు, కంపసాటి శ్రీనివాసులపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నకిలీ నోట్లు చలామణి చేసే సమయంలో ఎవరైనా అనుమానిస్తే పోలీసుల అవతారం ఎత్తి బెదిరించేవారు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్స్, వాకీటాకీలతో నిజమైన పోలీసుల్లా నటిస్తూ ఎదురు ప్రశ్నించిన వారిని భయపెట్టేవారు. ఇలా గతంలో ఇద్దరు వ్యక్తులను బెదిరించి సుమారు రూ.5 లక్షల వరకు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు, ఈ ముఠాలోని నిందితుడు మాణిక్యరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లోని ముదివేడు పోలీస్ స్టేషన్‌లో గతంలోనే హత్య కేసు నమోదై ఉన్నట్లు సీపీ వెల్లడించారు. మొత్తానికి తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఆశతో నకిలీ కరెన్సీ దందాకు దిగిన ఈ ముఠా చివరకు పోలీసుల వలలో చిక్కుకుంది.