Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది..? 85 శాతం చూపు కోల్పోయా.. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చంటూ లేఖ..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని, కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయానని వెల్లడించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన తాజాగా సంచలన లేఖ రాశారు. పాకిస్థాన్ న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సరైన వైద్య చికిత్స అందడం లేదని, ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రాణాలతో బయటపడతాననే నమ్మకం కూడా లేదని పేర్కొన్నారు.
తన కుడి కంటిలో ఇప్పటికే 85 శాతం చూపు కోల్పోయినట్లు ఇమ్రాన్ ఖాన్ లేఖలో వెల్లడించారు. దీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచడం, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే ఆరోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. రోజులో దాదాపు 22 గంటల పాటు తనను ఒంటరిగా ఉంచుతున్నారని తెలిపారు. నవంబర్ 10న తన రక్తపోటు 192-193 స్థాయికి చేరిందని, దీనివల్ల గుండెపోటు లేదా మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తులను కోరారు.
ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యంతో పాటు భార్య బుష్రా బీబీ పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు గతంలో కంటి సమస్యలు రావడంతో శస్త్రచికిత్స కూడా జరిగిందని, ప్రస్తుతం చూపు మరింత దెబ్బతింటోందని వెల్లడించారు. ఆమెకు కూడా సరైన వైద్యం అందించాలని న్యాయస్థానాలను విజ్ఞప్తి చేశారు. ఒకవైపు తన ఆరోగ్యం క్షీణిస్తుండగా, మరోవైపు భార్య ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారిందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇమ్రాన్ ఖాన్ 2022లో పాకిస్థాన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఆయనపై అవినీతి సహా పలు కేసులు నమోదయ్యాయి. 2023 ఆగస్టు నుంచి జైలులోనే ఉంటున్నారు. తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షతోనే నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ న్యాయమూర్తులకు లేఖ రాయడంతో పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. జైలులో తనకు తగిన వైద్యం అందుతుందా? న్యాయస్థానాలు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి.. అన్నది ఆసక్తికరంగా మారింది.