Indhiramma Sarees: మహిళలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే కోటి మందికి ఇందిరమ్మ చీరలు..!
తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ ఉచిత చీరల పంపిణీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. అచ్చంపేటలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరలు అందించనుండగా, 60 ఏళ్లలోపు వారికి 6.30 మీటర్ల పాలిస్టర్ చీరలు, 60 ఏళ్లు దాటిన వారికి 9 మీటర్ల పాలీకాటన్ చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.336 కోట్లు ఖర్చు చేస్తోంది.
తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక అందించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ మహిళాశక్తి పథకం కింద కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం లాంఛనంగా ప్రారంభించిన వెంటనే అదే రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చీరల పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.336 కోట్లను కేటాయించింది.
ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం కోటి చీరల్లో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 35 లక్షలు కేటాయించారు. పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా అర్హులైన వారిని గుర్తించి, పారదర్శకంగా చీరలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో చీరల నాణ్యతపై విమర్శలు రావడంతో ఈసారి వాటి తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో, రోజువారీ వినియోగానికి అనువుగా ఉండేలా వీటిని సిద్ధం చేశారు.
ఈసారి మహిళల వయసును బట్టి చీరల పొడవులోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. 59 ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళల కోసం 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలను తయారు చేయించింది. ఇక 60 ఏళ్లు దాటిన మహిళల కోసం 9 మీటర్ల పొడవుతో ఐదు లక్షల పాలీకాటన్ చీరలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకునే వృద్ధ మహిళలకు సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ కట్టుకు అనువైన రీతిలో చీరలను తయారు చేయించినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ పథకం మహిళలకు ఉచిత చీరలు అందించడంతోపాటు చేనేత రంగానికి కూడా ఊతమివ్వనుంది. సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని మరో 13 ప్రాంతాల్లో ఈ చీరలను తయారు చేయించారు. దీంతో వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి లభించింది. రూ.336 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పండుగ కానుక అందించడంతోపాటు స్థానిక చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నెల 26 నుంచి పంపిణీ ప్రారంభం కానుండటంతో తమకు ఎలాంటి చీర వస్తుంది, ఎక్కడ పంపిణీ చేస్తారనే విషయాలపై మహిళల్లో ఆసక్తి నెలకొంది.