వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..!

india alliance
ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..! Photo: ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..!

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సభకు 10 లక్షల మంది వరకు వస్తారని కూటమి అంచనా వేస్తుండగా.. భద్రత కోసం 4 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సభకు 10 లక్షల మంది వరకు వస్తారని కూటమి అంచనా వేస్తుండగా.. భద్రత కోసం 4 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమి.. ఆదివారం భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఈ సభకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానికి 10 లక్షల మంది వరకు హాజరవుతారని కూటమి అంచనా వేస్తోంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించారన్నది ఇండియా కూటమి ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని, SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నాయి. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చడంతో పాటు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కూడా తమ డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. భారీ సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదాన్‌తో పాటు ర్యాలీ మార్గంలో 4,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. వీరికి తోడుగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) సిబ్బంది కూడా విధుల్లో ఉండనున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు మైదాన్‌ను 14 భద్రతా జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌ను ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. మైదాన్ పరిసర ప్రాంతాల్లో 200కు పైగా సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్లు, పోలీసుల బాడీ వార్న్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించనున్నారు. సభకు వచ్చే వారిని నిర్ణీత ప్రవేశ మార్గాల్లో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. మరోవైపు భారీ ర్యాలీ కారణంగా ఢిల్లీలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే సభకు 10 లక్షల మంది వస్తారని ఇండియా కూటమి చెబుతుండగా.. సుమారు 50 వేల మంది హాజరవుతారని ఢిల్లీ పోలీసుల అంచనా. రామ్‌లీలా మైదాన్‌లో ఏర్పాట్లు, రద్దీ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల నిరసన, ఓటర్ల జాబితా సవరణపై రాజకీయంగా సాగుతున్న వివాదం నేపథ్యంలో ఈ సభ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.