Indian Railways: భారత్‌లోకి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. గంటకు 249 కి.మీ. వేగం.. లోపల సదుపాయాలు చూస్తే ఆశ్చర్యపోతారు..!
భారత్‌లో స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులోని BEML ప్లాంట్‌లో రూపొందుతున్న B28 రైలు ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ కోసం సిద్ధమవుతోంది. గంటకు 280 కి.మీ. గరిష్ఠ పరీక్షా వేగం, 249 కి.మీ. నిర్వహణ వేగంతో రూపొందిస్తున్న ఈ రైలులో 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
రైలు ప్రయాణం అంటే గంటల తరబడి ఎదురుచూడాల్సిన రోజులు త్వరలో మారనున్నాయి. విమాన వేగానికి దగ్గరగా దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రయాణం మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ పనులు కొనసాగుతుండగా.. ఈ మార్గం కోసం భారత్‌లోనే రూపొందిస్తున్న తొలి స్వదేశీ హైస్పీడ్ రైలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బెంగళూరులోని BEML తయారీ కేంద్రంలో రూపుదిద్దుకుంటున్న ఈ రైలుకు B28 అనే పేరు పెట్టారు. భారతీయ ప్రయాణికుల అవసరాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీనిని రూపొందిస్తున్నారు.
ఈ రైలు వేగం తెలిస్తేనే ఆశ్చర్యపోతారు. పరీక్షల సమయంలో గంటకు గరిష్ఠంగా 280 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేయగా.. సాధారణ నిర్వహణ వేగం గంటకు 249 కిలోమీటర్లుగా ఉండనుంది. సుమారు 202 మీటర్ల పొడవుండే ఈ రైలులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. వీటిలో నాలుగు మోటార్ కోచ్‌లు, మరో నాలుగు ట్రైలర్ కోచ్‌లు. ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఏడు కోచ్‌లలో 3×2 సీటింగ్‌తో స్టాండర్డ్ క్లాస్, మరో కోచ్‌లో 2×2 సీటింగ్‌తో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికుల కోసం కూడా సీట్లు కేటాయించారు. అంతేకాదు.. భవిష్యత్తులో రెండు ఎనిమిది కోచ్‌ల రైళ్లను కలిపి 16 కోచ్‌లుగా నడిపే అవకాశమూ ఉంది.
ప్రయాణికులకు సౌకర్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాళ్లు చాపుకుని కూర్చునేందుకు తగినంత స్థలం, విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ పాయింట్లు ఉండనున్నాయి. లగేజీ పెట్టుకునేందుకు ఓవర్‌హెడ్ ర్యాక్‌లతో పాటు ప్రత్యేక స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. బయో డైజెస్టర్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో LCD స్క్రీన్ల ద్వారా రైలు ప్రయాణ సమాచారం అందుతుంది. వైఫై ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్లు, అత్యవసర సమయాల్లో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నారు. దివ్యాంగుల కోసం వీల్‌చైర్‌కు అనుకూలమైన టాయిలెట్లు, బ్రెయిలీ సూచనలు, ప్లాట్‌ఫామ్‌తో సమానంగా ఉండే బోర్డింగ్ సదుపాయాలు కూడా ఉంటాయి.
ఇక సాంకేతికత పరంగా చూస్తే ఈ రైలులో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి కోచ్‌లో రెండు HVAC యూనిట్ల ద్వారా ఉష్ణోగ్రత, తేమను నియంత్రిస్తారు. ప్రయాణ సమయంలో శబ్దం, కంపనాలు తగ్గించేందుకు ప్రత్యేక ఇన్సులేషన్ ఏర్పాటు చేస్తున్నారు. 25 కేవీ ఏసీ విద్యుత్ వ్యవస్థతో నడిచే ఈ రైలులో రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అంటే రైలు బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తయ్యే శక్తిలో కొంత భాగాన్ని తిరిగి విద్యుత్‌గా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గాలి నిరోధకత తగ్గించడంతో పాటు సొరంగాల్లో ప్రయాణించేటప్పుడు శబ్దం, గాలి ఒత్తిడి ప్రభావాలను తగ్గించేలా ఏరోడైనమిక్ డిజైన్ చేశారు. ప్రస్తుతం తయారీ, నాణ్యత పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రైలు ప్రయాణికులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం తదుపరి పరీక్షలు, అనుమతులు, కారిడార్ పనుల పురోగతిపై ఆధారపడి ఉంటుంది.