వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Honey Trap: పాక్ మహిళ వలలో భారత కమాండర్.. నగ్న ఫొటోకు బదులుగా యుద్ధ రహస్యాలు లీక్..?

Honey Trap

పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన మహిళ హనీట్రాప్‌లో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ చిక్కుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 3,008 వాట్సాప్ మెసేజ్‌లు, 65 ఫొటోలు, 42 వాయిస్ కాల్స్ ద్వారా సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ.. ఆ తర్వాత హనీట్రాప్.. చివరకు దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం శత్రుదేశానికి చేరినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ పాకిస్థాన్ నిఘా సంస్థ వలలో చిక్కుకున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధ ప్రణాళికలు, డ్రోన్ విభాగం వివరాలు, సైనిక విన్యాసాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల ఛార్జ్‌షీట్ ప్రకారం.. 2026 జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 మధ్య సదరు అధికారి పాక్ ఏజెంట్‌తో వాట్సాప్‌లో విస్తృతంగా సంభాషించాడు. ఈ వ్యవధిలో ఏకంగా 3,008 మెసేజ్‌లు పంపడంతో పాటు 65 ఫొటోలు షేర్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటితో పాటు 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్ కూడా జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో అందరినీ విస్మయానికి గురిచేసిన అంశం మరొకటి ఉంది. అవతలి మహిళ పంపిన ఓ అశ్లీల ఫొటోకు ప్రతిగా రహస్య యుద్ధ ప్రణాళిక పత్రంలోని ఒక పేజీని ఆ అధికారి పంపినట్లు పోలీసులు ఆరోపించారు. అంతేకాదు.. ఒక్కో నగ్న ఫొటో పంపితే యుద్ధ ప్రణాళికలోని మరో పేజీని పంపిస్తానని ఆఫర్ ఇచ్చినట్లు ఛార్జ్‌షీట్‌లో వివరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం కేవలం పత్రాల పంపకానికే పరిమితం కాలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. వైమానిక దళంలోని అత్యంత రహస్య డ్రోన్ విభాగం సామర్థ్యం, పరీక్షలు, లక్ష్యాలను ఛేదించే వ్యవస్థకు సంబంధించిన వివరాలను కూడా ఆయన లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యుద్ధ సమయంలో సైన్యాన్ని మోహరించే ప్రాంతాలు, లేహ్‌లో యుద్ధ విమానాల కదలికలు, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాల సమాచారం కూడా పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు పాక్ ఏజెంట్ సూచనల మేరకు తన కింద పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది కమ్యూనికేషన్ పరికరాల్లో స్పైవేర్, మాల్‌వేర్ యాప్‌లను రహస్యంగా ఇన్‌స్టాల్ చేయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్‌ల ద్వారా వైమానిక దళ అంతర్గత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల సమయంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళతో సదరు అధికారి సన్నిహితంగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు కథనం పేర్కొంది. వాయుసేన అధికారుల ఫిర్యాదు ఆధారంగా 2026 మే 30న అధికారిక రహస్యాల చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా సేకరించేందుకు శత్రుదేశాల నిఘా సంస్థలు ఎలా ప్రయత్నిస్తున్నాయనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సైనిక అధికారులు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు గుర్తుచేస్తోంది.