Jailer 2 Box Office: తొలి రోజే రూ.125 కోట్లు.. రజనీకాంత్ సినిమా రికార్డుల మోత!
రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడించాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15న దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడించాయి. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది. అయితే ‘కూలీ’, ‘లియో’ తొలి రోజు వసూళ్ల రికార్డులను మాత్రం అధిగమించలేకపోయింది.
తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ అంచనాల ప్రకారం, ‘జైలర్ 2’ భారత్‌లో తొలి రోజు రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. పన్నులతో కలిపి దేశీయ గ్రాస్ వసూళ్లు రూ.70.25 కోట్లుగా నమోదయ్యాయి. విదేశీ మార్కెట్ల నుంచి మరో రూ.55 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరాయి. ఇవి ప్రాథమిక అంచనాలు కాగా, అధికారిక గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
తెలుగు వెర్షన్ వసూళ్లు ఎంత? భాషల వారీగా చూస్తే తమిళ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధించింది. తమిళంలో రూ.43.35 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ రూ.12.50 కోట్లు, హిందీ వెర్షన్ రూ.3.50 కోట్లు వసూలు చేశాయి. కన్నడ వెర్షన్ రూ.35 లక్షలు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి తొలి రోజు ఆక్యుపెన్సీ 55.4 శాతంగా నమోదైంది.
‘కూలీ’, ‘లియో’ రికార్డులు మాత్రం పదిలం: రజనీకాంత్ నటించిన ‘కూలీ’ 2025లో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.151.10 కోట్లు వసూలు చేసింది. విజయ్ నటించిన ‘లియో’ 2023లో రూ.142 కోట్ల ఓపెనింగ్ సాధించింది. ‘జైలర్ 2’ రూ.125.25 కోట్లతో ఈ రెండు సినిమాల తర్వాతి స్థానంలో నిలిచింది.
ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, ఎస్.జే. సూర్య, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.