పట్టపగలే బ్యాంకులోకి దూసుకొచ్చిన ఐదుగురు.. తుపాకులతో బెదిరించి రూ.4 కోట్ల బంగారం దోచేశారు!
బ్యాంకులో డబ్బులు, బంగారు ఆభరణాలు భద్రంగా ఉంటాయని భావిస్తాం. కానీ పట్టపగలే ఐదుగురు దుండగులు తుపాకులతో బ్యాంకులోకి చొరబడి కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు సిబ్బంది, ఖాతాదారులను తుపాకులతో బెదిరించి ఒకచోట చేర్చారు.
బ్యాంకులో డబ్బులు, బంగారు ఆభరణాలు భద్రంగా ఉంటాయని భావిస్తాం. కానీ పట్టపగలే ఐదుగురు దుండగులు తుపాకులతో బ్యాంకులోకి చొరబడి కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు సిబ్బంది, ఖాతాదారులను తుపాకులతో బెదిరించి ఒకచోట చేర్చారు. వారి ముఖాలు, చేతులకు టేపులు చుట్టి బంధించారు. ఆ తర్వాత లాకర్లోని బంగారు ఆభరణాలు, నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిధ్ జిల్లా ధన్వర్ మార్కెట్ సమీపంలోని ఓ బ్యాంకును ఐదుగురు దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. రెండు బైక్‌లపై అక్కడికి చేరుకున్న నిందితుల్లో ఒకరు హెల్మెట్ ధరించగా, మిగిలిన నలుగురు ముఖాలకు ముసుగులు వేసుకున్నారు. అందరి చేతుల్లో తుపాకులు ఉండటంతో బ్యాంకులోకి ప్రవేశించిన వెంటనే భయాందోళనలు నెలకొన్నాయి. నేరుగా బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లిన దుండగులు ఆయనపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు.
ఆ తర్వాత బ్యాంకులో ఉన్న సిబ్బంది, ఖాతాదారులందరినీ ఒకచోటికి తీసుకెళ్లి వారి ముఖాలు, చేతులకు టేపులు చుట్టారు. ఎవరూ ప్రతిఘటించకుండా భయపెట్టిన అనంతరం మేనేజర్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. లాకర్ తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును సంచుల్లో వేసుకున్నారు. అంతటితో ఆగకుండా బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లారు. దోపిడీ పూర్తిచేసుకున్న తర్వాత రెండు బైక్‌లపై అక్కడి నుంచి వేగంగా పారిపోయారు.
బ్యాంకు సిబ్బంది ప్రాథమిక అంచనా ప్రకారం.. సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, మరో రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ భారీ దోపిడీ జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. పట్టపగలు ఇంతటి సాహసానికి దుండగులు పాల్పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీకి ఉపయోగించిన రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ డీవీఆర్‌ను కూడా దుండగులు తీసుకెళ్లడంతో దర్యాప్తులో కీలక ఆధారాల కోసం పోలీసులు ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారు. కోట్ల విలువైన సొత్తుతో పరారైన ఐదుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.