కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కార్పియో ఢీకొని నలుగురు భవానీ భక్తులు దుర్మరణం!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడ వెళ్తున్న భవానీ భక్తుల ప్రైవేటు బస్సులో సాంకేతిక లోపం రావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపారు. బస్సు దిగి టీ తాగేందుకు వెళ్తున్న భక్తులను వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొట్టింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని కత్తిపూడి వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తులపైకి వేగంగా వచ్చిన స్కార్పియో దూసుకెళ్లడంతో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా డెంకాడ ప్రాంతానికి చెందిన భవానీ భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం ఒక ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ప్రయాణ మార్గంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారి వద్దకు చేరుకునేసరికి బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. మరమ్మతులు జరుగుతున్న సమయంలో బస్సులోని కొందరు భవానీ భక్తులు సేదతీరేందుకు, టీ తాగేందుకు కిందకు దిగారు. రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణం వైపునకు నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక స్కార్పియో వాహనం వారిపైకి దూసుకెళ్లి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు ముగ్గురు భవానీ భక్తులు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. మరొక భక్తుడు తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కోసం ఉత్సాహంగా బయలుదేరిన భక్తులు మార్గమధ్యంలోనే మృత్యువాత పడటంతో వారి స్వగ్రామం డెంకాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.