వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జ్యోతిష్యం | రచన: Kalyan |

కార్తీక మాసంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ధ్వజస్తంభానికి కట్టడం వెనుక కారణం ఇదే..!

karthika-masam

కార్తీక మాసంలో ఆలయాల ధ్వజస్తంభాలపై ఆకాశదీపాన్ని వెలిగించడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. శివకేశవుల అనుగ్రహం కోసం, పితృదేవతలకు మార్గం చూపేందుకు, ప్రకృతిలోని జీవుల పట్ల దయను చాటేందుకు ఈ దీపాన్ని వెలిగిస్తారని పురాణ సంప్రదాయాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో బాటసారులకు దారి చూపించడంలోనూ ఆకాశదీపం కీలక పాత్ర పోషించేదని చెబుతారు. అసలు ఈ దీపాన్ని ఎందుకు ధ్వజస్తంభానికి వేలాడదీస్తారో తెలుసుకుందాం.

కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. తెల్లవారుజామునే నదీస్నానాలు, శివాలయాల్లో అభిషేకాలు, సాయంత్రం వేళ దీపారాధనలతో భక్తులు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా కనిపించే మరో సంప్రదాయం ఆకాశదీపం. ముఖ్యంగా ఆలయాల ధ్వజస్తంభాలపై ఎత్తుగా వేలాడదీసే ఈ దీపాన్ని ఎప్పుడైనా గమనించారా? అసలు ఆకాశదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? దానిని అంత ఎత్తులో ఎందుకు ఉంచుతారు? దీని వెనుక ఆధ్యాత్మిక విశేషాలతో పాటు ఆసక్తికరమైన సంప్రదాయాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో సూర్యాస్తమయం తర్వాత శివాలయాలు, వైష్ణవాలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. మట్టితో లేదా లోహంతో తయారు చేసిన చిల్లులు ఉన్న ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తారు. అనంతరం దానిని ఆలయ ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ఈ సమయంలో 'దామోదరమావాహయామి', 'త్రయంబకమావాహయామి' అంటూ విష్ణుమూర్తిని, పరమశివుడిని ఆహ్వానిస్తూ దీపారాధన చేస్తారు. ఈ దీపం ద్వారా హరిహరుల తేజస్సు ప్రపంచమంతా ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఆకాశదీపాన్ని దర్శించుకుని దీపాలు వెలిగిస్తే జ్ఞానసంపద, పుణ్యఫలం లభిస్తాయని కార్తీక పురాణం చెబుతున్నట్లు పెద్దలు వివరిస్తారు. అయితే ఆకాశదీపానికి పితృదేవతలతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉందని పురాణ సంప్రదాయాల్లో చెబుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలు తమ లోకాలకు ప్రయాణిస్తారని, వారికి మార్గం చూపించేందుకు గృహస్తులు ఇంటి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలని శాస్త్రవచనం. ఈ దీపాల కాంతి పితృదేవతలకు దారి చూపుతుందని, వారి ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని నమ్ముతారు. అంతేకాదు, ఆకాశదీపం కేవలం పూజా సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదని, ప్రకృతిలోని ఇతర జీవుల పట్ల దయ చూపాలనే సందేశం కూడా ఇందులో ఉందని పెద్దలు చెబుతారు. రాత్రివేళ ఆకాశంలో ప్రయాణించే పక్షులు దీపకాంతిని గుర్తించి తమ దిశను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంప్రదాయ విశ్వాసం. ఆకాశదీపాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీయడం వెనుక మరో ఆసక్తికరమైన కారణం కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఇప్పటిలా రవాణా సౌకర్యాలు, రహదారి దీపాలు ఉండేవి కావు. ప్రయాణికులు ఎక్కువగా కాలినడకనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు. అలాంటి సమయంలో రాత్రివేళ దూరం నుంచి కనిపించే ఆలయ ఆకాశదీపం వారికి మార్గదర్శకంగా ఉండేదని చెబుతారు. దీపాన్ని చూసి అక్కడ సమీపంలో ఆలయం, గ్రామం ఉన్నాయని గుర్తించి ప్రయాణికులు అక్కడికి చేరుకుని రాత్రిపూట విశ్రాంతి తీసుకునేవారట. అందుకే ఆకాశదీపం అనేది కేవలం దేవుడి కోసం వెలిగించే దీపమే కాకుండా, దారి తప్పిన వారికి దారి చూపించే జ్యోతిగా కూడా భావించేవారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు మరింత విశిష్టత ఉంటుంది. ఈ రోజున గుత్తి దీపాలు, పెద్ద వత్తులతో దీపాలు వెలిగించడం ప్రత్యేక సంప్రదాయం. ఇంట్లో మాత్రమే కాకుండా వీధులు, ఆలయ ప్రాంగణాల్లో కూడా దీపాలు వెలిగించేవారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సమస్త జీవుల పట్ల దయ, ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉండటమేనని ఆధ్యాత్మిక పెద్దలు వివరిస్తారు. భగవంతుడు పంచభూతాల స్వరూపమని భావించే మన సంప్రదాయంలో అగ్ని, వెలుగు కూడా పవిత్రమైనవే. పక్షులకు వేసవిలో నీరు అందించినట్లే, రాత్రివేళ ఇతర జీవులకు కూడా మేలు కలగాలనే భావనతో దీపాలు వెలిగించే ఆచారం ఏర్పడిందని చెబుతారు. అందుకే ఆకాశదీపం అంటే కేవలం ఒక ప్రమిదలో వెలిగించే జ్యోతి మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో ఆధ్యాత్మిక భావనలు, ప్రకృతి పట్ల ప్రేమ, జీవుల పట్ల దయ దాగి ఉన్నాయి. ఈ దీపాన్ని వెలిగించినా, అందులో నూనె పోసినా, భక్తితో దర్శించుకుని నమస్కరించినా పుణ్యప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించే దీపం పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఈ దీపకాంతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుందని ఆధ్యాత్మిక భావన. అందుకే ఆకాశదీపాన్ని కేవలం ఆలయాలకే పరిమితం చేయకుండా ఇంటి బయట కూడా వెలిగించవచ్చని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని దర్శించుకోవడం వెనుక ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట!