వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Kartika Masam: కార్తీక మాసంలో ఈ తేదీలు అస్సలు మిస్ కావద్దు.. నాగుల చవితి నుంచి పోలీ స్వర్గం వరకు!

2026 కార్తీక మాసం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ మాసంలో నాలుగు కార్తీక సోమవారాలు, నాగుల చవితి, ప్రబోధిని ఏకాదశి, తులసీ వివాహం, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, మాస శివరాత్రి వంటి ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి.

కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. హిందువుల ఇళ్లలో ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. తెల్లవారుజామునే నదీ స్నానాలు, ఆలయ దర్శనాలు, శివాభిషేకాలు, దీపారాధనలతో నెలంతా భక్తిమయంగా గడుపుతారు. ముఖ్యంగా శివకేశవుల ఆరాధనకు ఈ మాసంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివుడికి అభిషేకాలు చేయడంతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం, తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం, కార్తీక పురాణం చదవడం వంటి ఆచారాలను భక్తులు ఎంతో నియమనిష్ఠలతో పాటిస్తారు. ఈ ఏడాది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం నవంబర్ 10, మంగళవారం బలి పాడ్యమి రోజున ప్రారంభమై.. డిసెంబర్ 8, మంగళవారం కార్తీక బహుళ అమావాస్యతో ముగియనుంది. కార్తీక మాసం ప్రారంభమైన నవంబర్ 10న బలి పాడ్యమి, గోవర్ధన పూజ నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం వామనావతారంలో శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపిన అనంతరం.. ఏడాదికి ఒకసారి భూలోకానికి వచ్చి ప్రజలను చూడటానికి వరం ఇచ్చినట్లు కథనం. అందుకే ఈ రోజును బలి పాడ్యమిగా జరుపుకుంటారు. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల ప్రజలను కాపాడిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ గోవర్ధన పూజ చేస్తారు. నవంబర్ 11న యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో దీనినే భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు. యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసినట్లు పురాణ కథనం. ఈ రోజున సోదరులు తమ సోదరీమణుల ఇంటికి వెళ్లి భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. నవంబర్ 13న నాగుల చవితి పర్వదినం రానుంది. ఈ రోజున నాగదేవతలను పూజించడం ఆనవాయితీ. భక్తులు నాగుల పుట్ట వద్ద పూజలు నిర్వహించి పాలు సమర్పిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. సంతాన ప్రాప్తి, కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు. ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నవంబర్ 16, 23, 30 తేదీలతో పాటు డిసెంబర్ 7న కార్తీక సోమవారాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేయడం, ఆలయాల్లో దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా నవంబర్ 16న వచ్చే మొదటి కార్తీక సోమవారం, శ్రవణ నక్షత్ర యోగం కారణంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 20న కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి వస్తుంది. దీనినే ఉత్థాన ఏకాదశి, చిలుక ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య కాలంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ రోజున మేల్కొంటాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం పాటిస్తారు. తులసి మొక్క, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ముగింపుతో శుభకార్యాలకు మళ్లీ అనుకూల సమయం ప్రారంభమవుతుందని సంప్రదాయ విశ్వాసం. నవంబర్ 21న క్షీరాబ్ధి ద్వాదశి, తులసీ వివాహం నిర్వహిస్తారు. ఈ రోజున తులసి మొక్కకు శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడితో వివాహం జరిపించడం ఆనవాయితీ. తులసి కోటను అందంగా అలంకరించి దీపాలు వెలిగిస్తారు. పాలు, పెరుగు తదితర పదార్థాలతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి రానుంది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో ఇది ఒకటి. ఈ రోజున శివకేశవులను పూజించడం, నదీ స్నానాలు ఆచరించడం, దీపారాధన, దీపదానం చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణం ఈ పర్వదినానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అగ్నితో నిర్మించిన తోరణం గుండా వెళ్లడం శివుడి అనుగ్రహాన్ని పొందే పవిత్ర ఆచారంగా భావిస్తారు. నవంబర్ 27న సంకటహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించి వ్రతం ఆచరిస్తారు. విఘ్నాలు తొలగి పనులు విజయవంతం కావాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇక డిసెంబర్ 4న కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి వస్తుంది. ఏకాదశి దేవత శ్రీమహావిష్ణువు శరీరం నుంచి ఉద్భవించి మురాసురుడిని సంహరించినట్లు పురాణ కథనం. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం విశేష ఫలప్రదమని భక్తులు విశ్వసిస్తారు. డిసెంబర్ 7న కార్తీక మాసంలోని చివరి సోమవారం, మాస శివరాత్రి వస్తున్నాయి. ఈ రోజున శివుడికి రుద్రాభిషేకం, బిల్వదళాలతో అర్చన చేయడం, ఉపవాసం ఉండటం విశేషంగా భావిస్తారు. ఇక డిసెంబర్ 8న కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజును పోలీ అమావాస్య లేదా పోలీ స్వర్గంగా పిలుస్తారు. ఆకాశ దీపం, దీపారాధన, కార్తీక మాస దీక్ష ముగింపు వంటి ఆచారాలతో భక్తులు ఈ మాసానికి వీడ్కోలు పలుకుతారు. ఇలా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు శివకేశవుల ఆరాధన, పండుగలు, వ్రతాలు, దీపారాధనలతో కార్తీక మాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.