Kartika Masam: ఏడాది పొడవునా దీపం వెలిగించలేదా.. కార్తీకంలో ఈ ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుందట..!
కార్తీక మాసంలో 365 వత్తులతో గుత్తి దీపం వెలిగించే సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాది పొడవునా దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపం పెట్టిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో శివుడిని, విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ దీపాలు వెలిగిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. రోజూ దీపం వెలిగించడం, ఉపవాసాలు ఉండటం, పుణ్యస్నానాలు చేయడం, దానధర్మాలు నిర్వహించడం వంటివి ఈ మాసంలో చాలామంది ఆచరిస్తుంటారు. అయితే ఏడాది మొత్తం ప్రతిరోజూ దీపం పెట్టడం సాధ్యం కాని వారు మాత్రం కార్తీక మాసంలో ఓ ప్రత్యేక దీపారాధన చేస్తుంటారు. అదే 365 వత్తులతో వెలిగించే గుత్తి దీపం. అసలు ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? ఎలా వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆషాఢ మాసంలో శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీక మాసంలోని ప్రభోదిని ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పురాణాలు చెబుతాయి. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రతం కూడా ముగుస్తుంది. అందుకే కార్తీక మాసంలోని ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో దశమి, ఏకాదశి, తులసీ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాలు రావడంతో భక్తులు విశేషంగా పూజలు చేస్తుంటారు. ఈ పవిత్ర మాసంలో 365 వత్తులతో గుత్తి దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించడానికి ముందుగా 365 వత్తులను నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యిలో నానబెట్టుకోవాలి. అనంతరం వాటిని ఒక పెద్ద ప్రమిదలో గుత్తిగా అమర్చుకోవాలి. ప్రమిదకు పసుపు, కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేయాలి. దీపాన్ని నేరుగా నేలపై పెట్టకుండా తమలపాకు, బియ్యం లేదా రాగి పాత్రపై ఉంచడం సంప్రదాయంగా భావిస్తారు. అలాగే దీపం చుట్టూ అష్టదళ పద్మ ఆకారంలో ముగ్గు వేసి, వత్తులపై కొద్దిగా కర్పూరం చూర్ణం చల్లుకుంటారు.
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అగరబత్తీలు వెలిగించి వాటి ద్వారా గుత్తి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దామోదర నామాన్ని లేదా శివ నామాన్ని స్మరిస్తూ భక్తితో నమస్కరించాలి. పువ్వులు సమర్పించి మనసులోని కోరికలను తెలియజేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. ఈ దీపారాధనను ఇంటి పెద్దలు లేదా గృహ యజమాని నిర్వహించడం మంచిదని సంప్రదాయంలో చెబుతారు. పూజ సమయంలో హడావుడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించాలి.
ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపారాధన చేయలేకపోయిన వారు, మధ్యలో ఏవైనా ఆటంకాల వల్ల దీపం వెలిగించలేని వారు కార్తీక మాసంలో ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆచారం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, కుటుంబంలో శుభాలు కలుగుతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది భక్తులు 365 వత్తుల గుత్తి దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.