వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

Kavitha: కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్‌కు సూటి ప్రశ్న..!

Kavitha

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? లేదా? అనే విషయాన్ని బీఆర్‌ఎస్ స్పష్టం చేయాలని కోరారు.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ ఫామ్‌హౌస్ అంశం చర్చకు వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు జరిగిందా? అక్కడికి కెనాల్ ఉందా? లేదా? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తుల విషయంలోనూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ప్రజలకు రాసిస్తానని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు సంబంధించి ఐదు ఎకరాలను హరీశ్‌రావు, ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడిస్తామని, ఆయనను ప్రజాజీవితం నుంచి తరిమివేస్తామని వ్యాఖ్యానించారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో హరీశ్‌రావుపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావులకు ప్రజలు చాలా ఏళ్లు అవకాశమిచ్చారని, ఇప్పుడు తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లో మార్పు రావాలని, కొత్తవారికి అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు బీఆర్‌ఎస్ అన్యాయం చేసిందని, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా తన సొంత జిల్లాగా పేర్కొన్న కవిత.. అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. బీఆర్‌ఎస్ నేతలు తన గురించి మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై చేసిన వ్యాఖ్యలు, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని చేసిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.