వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Kilogram Salt: కిలో ఉప్పు ధర రూ.30 వేలు.. ఇది తింటే నరాలు కట్ అవ్వాల్సిందే.. ఇంత ఖరీదు ఎందుకంటే..?

Kilogram Salt

మన వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉప్పు కిలో ధర సాధారణంగా కొన్ని పదుల రూపాయలే. కానీ దక్షిణ కొరియాలో తయారయ్యే కొరియన్ వెదురు ఉప్పు ధర మాత్రం కిలోకు ఏకంగా రూ.30 వేల వరకు ఉంటుంది. తొమ్మిదిసార్లు ప్రత్యేక పద్ధతిలో కాల్చి తయారు చేసే ఈ ఉప్పుకు అంత ధర ఎందుకు? దీని ప్రత్యేకతలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

ఉప్పు లేని వంటకాన్ని ఊహించగలమా? ఎన్ని రకాల మసాలాలు వేసినా, ఎంత రుచిగా వండినా సరైన మోతాదులో ఉప్పు లేకపోతే ఆ వంటకానికి రుచే ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి వంటింట్లో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా మనం కిలో ఉప్పును రూ.20 నుంచి రూ.50 మధ్య కొనుగోలు చేస్తుంటాం. కానీ ప్రపంచంలో ఒక రకం ఉప్పు మాత్రం కిలో ధర ఏకంగా రూ.30 వేల వరకు పలుకుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. దక్షిణ కొరియాలో తయారయ్యే ఈ ప్రత్యేకమైన ఉప్పును 'జుక్యోమ్' (Jukyeom) లేదా కొరియన్ వెదురు ఉప్పు (Korean Bamboo Salt) అని పిలుస్తారు. ఇంతకీ ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకింత ధర పలుకుతోంది? సాధారణంగా సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును తయారు చేస్తారు. కానీ ఈ కొరియన్ వెదురు ఉప్పు తయారీ మాత్రం పూర్తిగా భిన్నం. వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ పద్ధతిలో దీనిని తయారు చేస్తారు. ముందుగా సముద్రపు ఉప్పును వెదురు కర్రల్లో నింపుతారు. ఆ తర్వాత వెదురు చివర్లను ఖనిజాలు కలిగిన ప్రత్యేకమైన బంకమట్టితో మూసివేస్తారు. ఇలా సిద్ధం చేసిన వెదురు కర్రలను కట్టెల మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. ఈ ప్రక్రియలోనే అసలు ప్రత్యేకత దాగి ఉంది. ఈ ఉప్పును ఒకసారి కాల్చి తయారు చేయరు. అదే ఉప్పును కొత్త వెదురు కర్రల్లో నింపుతూ మొత్తం ఎనిమిది సార్లు కాలుస్తారు. తొమ్మిదోసారి మాత్రం అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ప్రతి దశలోనూ వెదురు, మట్టి అవశేషాలను తొలగించి మళ్లీ కొత్త వెదురులో ఉప్పును నింపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా సమయం, శ్రమ అవసరం. ఇలా పలుమార్లు కాల్చడం వల్ల ఉప్పు రంగు, ఆకృతి మారుతాయి. కొన్ని రకాల వెదురు ఉప్పు ఊదా రంగులో కూడా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన తయారీ విధానం, నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ధర మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం అత్యంత నాణ్యమైన వెదురు ఉప్పు కిలో ధర సుమారు 347 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.30 వేల వరకు ఉంటుంది. ఈ వెదురు ఉప్పుకు కొరియాలో వంటకాలతో పాటు సంప్రదాయ వైద్యంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయని చెబుతారు. గతంలో సంప్రదాయ పద్ధతుల్లో జీర్ణ సమస్యలు, నోటి ఆరోగ్యానికి సంబంధించిన అవసరాల కోసం కూడా ఉపయోగించేవారని సమాచారం. అయితే దీనివల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడానికి తగినంత బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి దీనిని ఔషధంగా భావించి ఉపయోగించడం సరికాదు. మరి ఇంత ఖరీదైన వెదురు ఉప్పును వంటల్లో ఎలా ఉపయోగిస్తారు? సాధారణ ఉప్పులాగే దీనిని కూడా ఆహారంలో కలుపుకోవచ్చు. అయితే ధర ఎక్కువగా ఉండటంతో చాలామంది దీనిని రోజువారీ వంటల్లో కాకుండా ప్రత్యేకమైన వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కొందరు వంట పూర్తయ్యాక చివర్లో కొద్దిగా చల్లి రుచి కోసం వాడుతుంటారు. మనం కిలో ఉప్పును కొన్ని పదుల రూపాయలకే కొనుగోలు చేస్తుంటే.. మరోవైపు అదే ఉప్పు రకం కిలో ధర వేలల్లో ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.