వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Election Shock: అక్కడ ఏకంగా 10.50 లక్షల మంది ఓటర్ల పేర్లు మాయం.. ప్రతి నలుగురిలో ఒకరికి షాక్..!

kolkata
అక్కడ ఏకంగా 10.50 లక్షల మంది ఓటర్ల పేర్లు మాయం.. ప్రతి నలుగురిలో ఒకరికి షాక్..! Photo: అక్కడ ఏకంగా 10.50 లక్షల మంది ఓటర్ల పేర్లు మాయం.. ప్రతి నలుగురిలో ఒకరికి షాక్..!

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో SIR ప్రక్రియలో భాగంగా ఏకంగా 10,50,905 మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. మొత్తం ఓటర్లలో ఇది 25 శాతం కావడం గమనార్హం.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలిగిపోయాయి. మరీ ముఖ్యంగా మొత్తం ఓటర్లలో ప్రతి నలుగురిలో ఒకరి పేరు గల్లంతైనట్లు ఓ పరిశోధనా సంస్థ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపులు జరిగినట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ అనే కోల్‌కతాకు చెందిన పరిశోధనా సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. SIR ప్రక్రియ ప్రారంభానికి ముందు కోల్‌కతాలో మొత్తం 42,03,411 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వివిధ దశల్లో నిర్వహించిన తనిఖీలు, పరిశీలనల అనంతరం ఏకంగా 10,50,905 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అంటే పాత ఓటర్ల సంఖ్యలో దాదాపు 25 శాతం మంది పేర్లు తొలగిపోయాయి. ఈ లెక్కన ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 31,52,506కు చేరినట్లు అంచనా. అయితే ఇంకా చేర్పులు, తొలగింపులు జరిగే అవకాశం ఉండటంతో ఇదే తుది సంఖ్య కాదని సంస్థ స్పష్టం చేసింది. ఈ వివరాలను భారత ఎన్నికల సంఘం (ECI) నుంచి సేకరించినట్లు సబర్ ప్రతినిధి వెల్లడించారు. ఇక తొలగించిన పేర్లలో వివిధ కారణాలు ఉన్నాయి. బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన పరిశీలనలో అందుబాటులో లేని వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన వారు వంటి కేటగిరీల్లో 8,98,425 మంది పేర్లను తొలగించారు. వీరిలో 2,81,549 మంది మరణించినట్లు గుర్తించారు. మిగిలిన 7,69,356 మంది జీవించి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డారు. వీరిలో చాలామంది తమ పేర్లు ఎందుకు తొలగించారనే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే ఓటర్ల పేర్లు తొలగించడానికి ప్రధానంగా కనిపిస్తున్న కారణాల్లో చిరునామాలో అందుబాటులో లేకపోవడం మొదటి స్థానంలో ఉంది. ఈ కారణంతో 3,41,832 మంది పేర్లు తొలగించారు. శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించి 2,59,835 మందిని జాబితా నుంచి తొలగించారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన కారణంగా 15,205 మందికి తొలగింపు ఎదురైంది. ఇక ముసాయిదా జాబితాలో అదనంగా 26,007 పేర్లు తొలగించగా, పరిశీలన అనంతరం తార్కిక వ్యత్యాసాలు (Logical Discrepancies) ఉన్నట్లు గుర్తించి మరో 1,26,473 మంది పేర్లను తొలగించారు. ముఖ్యంగా పరిశీలన కోసం గుర్తించిన ఓటర్లలో సుమారు 2.66 లక్షల మంది ఉన్నారు. వీరిలో 1,26,473 మందిని తదుపరి అనుబంధ జాబితాల ద్వారా తొలగించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు SIR ట్రిబ్యునళ్లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ట్రిబ్యునళ్లలో అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని నివేదిక పేర్కొంది. మరోవైపు తమ పేర్లు పొరపాటున తొలగించారని భావించే వారు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)ను సంప్రదించి, అవసరమైన ఆధారాలతో అప్పీల్ చేసుకోవచ్చు. ఇక కోల్‌కతాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే చౌరంగీ నియోజకవర్గంలో అత్యధికంగా 41.7 శాతం ఓటర్ల పేర్లు తొలగిపోయాయి. ఇక్కడ 87,680 మంది పేర్లు జాబితా నుంచి తొలగించారు. జోరాసాంకోలో 39.4 శాతం (77,992), కోల్‌కతా పోర్ట్‌లో 32.1 శాతం (78,195), మెటియాబ్రూజ్‌లో 29.8 శాతం (78,528), బల్లిగంజ్‌లో 28.2 శాతం (71,849) మంది పేర్లు తొలగించారు. మరోవైపు టోలీగంజ్‌లో అత్యల్పంగా 14.4 శాతం (37,889) మంది పేర్లు తొలగించారు. బెహలా వెస్ట్‌లో 18 శాతం, జాదవ్‌పూర్‌లో 18.3 శాతం, బెహలా ఈస్ట్‌లో 18.6 శాతం, కస్బాలో 20.1 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా కోల్‌కతాలో నవంబర్ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 209 కొత్త వార్డులకు సంబంధించి దాదాపు 32 లక్షల మంది ఓటర్లతో ముసాయిదా జాబితా సిద్ధమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. మరోవైపు తుది సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం 2027 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. దీంతో ప్రస్తుతం తొలగించిన పేర్లలో ఎంతమందికి తిరిగి ఓటు హక్కు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.