వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది.. 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటున్న కేటీఆర్!

ktr-revanth

హనుమకొండ జన చైతన్య సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్ధి, పెన్షన్లు, మహిళలకు రూ.2,500 హామీ అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణలో అధికార మార్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలోని కేడీసీ మైదానంలో నిర్వహించిన జన చైతన్య సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్త పెన్షన్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, గతంలో ఉన్న పెన్షన్లను తొలగించి ఇప్పుడు కొత్తగా ఇస్తున్న వాటిని ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌లో చేరారు. వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడిన కేటీఆర్.. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే వరంగల్ నగరానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని, ఫ్యూచర్ సిటీగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని, నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రవీంద్ర భారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సంస్థలు వరంగల్‌కు వచ్చాయని చెబుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిందో చెప్పాలని నిలదీశారు. మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం లక్షాధికారులుగా అయినా చేయగలిగారా అంటూ ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ లెక్కన ఒక్కో మహిళకు రూ.87,500 చొప్పున బకాయి పడినట్లు పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెన్షన్ల విషయంలోనూ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వరంగల్‌కు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. సభలో గత ప్రభుత్వ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూపించే వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర పోషించిందని, కాకతీయుల పోరాట స్ఫూర్తి, కాళోజీ భావజాలం, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలి సభను ఇదే కేడీసీ మైదానంలో నిర్వహించారని చెబుతూ, ఆ చరిత్రను గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.