KTR Comments: సోనియా గుండెల్లో తెలంగాణకు చోటు లేదు.. ఆత్మకథపై కేటీఆర్ ఘాటు విమర్శలు..!
సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్'లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ హృదయంలోనే తెలంగాణకు చోటు లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ 'బిలాంగింగ్.. ఏ జర్నీ ఆఫ్ లవ్' ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ హృదయంలో, ఆత్మలో తెలంగాణకు చోటు లేనందుకే ఆమె ఆత్మకథలోనూ రాష్ట్ర ప్రస్తావన కనిపించలేదని విమర్శించారు. తెలంగాణ నాయకత్వం, ప్రజల పట్ల కాంగ్రెస్‌కు గౌరవం లేదని, అందుకే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కూడా తగిన గౌరవం దక్కలేదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన బహుమతి కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజల పోరాటం, ఎన్నో ఏళ్ల ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉద్యమ తీవ్రతకు భయపడి, రాజకీయ అనివార్యత కారణంగానే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలపై నిజమైన ప్రేమతో కాకుండా రాజకీయ అవసరాల కోసమే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను, కేసీఆర్ పోరాటాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ఏర్పాటుకు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ వైఖరిపైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవీపై ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి గతంలోనే గట్టి ప్రశ్నలు సంధించారని గుర్తుచేశారు. పీవీపై అంత ప్రేమ, గౌరవం ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని వాణీదేవి ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకుడైన పీవీకి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం ఇదేనా అంటూ ఆ పార్టీ తీరును కేటీఆర్ తప్పుబట్టారు.
మరోవైపు సోనియా గాంధీ ఆత్మకథలోని అంశాల ఆధారంగా సినిమా తీస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించడం కూడా రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పుస్తకంలోని తెలంగాణ ప్రస్తావన అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండగా, కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత ఎవరిది? ఉద్యమ చరిత్రను ఎవరు గుర్తించాలి? అనే అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.