Encounter: మసీదులో దాక్కున్న ఉగ్రవాది.. లొంగిపోవాలని వీడియో కాల్, చివరకు ఏం జరిగిందంటే..?
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో మసీదులో దాక్కున్న లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను లొంగిపోవాలని భద్రతా బలగాలు వీడియో కాల్ ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశాయి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో ఓ మసీదులో దాక్కున్న లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను బయటకు తీసుకొచ్చేందుకు బలగాలు ప్రయత్నించాయి. లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అతడు అంగీకరించలేదు. చివరకు భద్రతా దళాలపై కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లతీఫ్ భట్ మృతి చెందాడు.
నవంబర్ 11న అఖ్రాన్‌లోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడిలో లతీఫ్ భట్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో అతడి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా సోమవారం ఉమర్ నిసార్ అనే ఉగ్రవాదిని కూడా ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. తాజాగా లతీఫ్ భట్ ఆచూకీ కోసం కుల్గాం జిల్లాలో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. అతడు ఓ మసీదులో దాక్కున్నట్లు గుర్తించారు.
అక్కడి నుంచి బయటకు వచ్చి లొంగిపోవాలని భద్రతా బలగాలు లతీఫ్ భట్‌ను కోరాయి. వీడియో కాల్ ద్వారా పోలీసులు, ఉన్నతాధికారులు అతడితో మాట్లాడి లొంగిపోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీకు ఇంకా జీవితం ఉంది.. నువ్వు చాలా చిన్నవాడివి అంటూ అతడికి భవిష్యత్తు గురించి వివరించారు. అయితే అందుకు లతీఫ్ భట్ నిరాకరిస్తూ నేను అల్లాహ్‌ను కలవాలనుకుంటున్నాను.. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని లొంగదీసుకునేందుకు బలగాలు ప్రయత్నాలు కొనసాగించాయి.
అయితే తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో లతీఫ్ భట్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన దళాలు ఎదురుకాల్పులు జరపగా.. అతడు హతమయ్యాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ కూడా స్పందించింది. మీరు పారిపోవచ్చు.. కానీ తప్పించుకోలేరు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కుల్గాంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతుండటంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.