Medical Store: పిల్లలకు మందులు కొంటున్నారా.. జాగ్రత్త.. జంతువుల టానిక్‌ను అదే పేరుతో అమ్మేస్తున్నారంట..!
గుజరాత్‌లోని సూరత్‌లో పిల్లల మందు పేరుతో నకిలీ లేబుళ్ల దందా వెలుగులోకి వచ్చింది. జంతువులకు వినియోగించే టానిక్‌ను చిన్న సీసాల్లో నింపి, పిల్లల కోసం తయారుచేసిన మందుగా విక్రయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
పిల్లలకు మందులు కొనుగోలు చేస్తున్నారా? అయితే వాటి లేబుళ్లు, తయారీ వివరాలు ఒకసారి పరిశీలించుకోవాల్సిన ఘటన వెలుగులోకి వచ్చింది. జంతువుల కోసం ఉద్దేశించిన టానిక్‌ను చిన్న సీసాల్లోకి మార్చి, పిల్లల మందు పేరుతో విక్రయించినట్లు గుజరాత్‌లోని సూరత్‌లో ఓ మెడికల్ స్టోర్ యజమానిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, మెడికల్ షాపు యజమానిని అరెస్టు చేశారు. ఈ ఘటన ప్రజారోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని గోపిపురా ప్రాంతంలో ఉన్న శాంతినాథ్ మెడికల్ స్టోర్‌పై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తాజాగా దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మహమ్మద్ సాజిద్ ఇబ్రహీం ముల్లా (51)ను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్‌సింగ్ నకుమ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో నకిలీ లేబుళ్లను ఉపయోగించి మందుల పేరుతో విక్రయాలు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా.. జంతువుల కోసం ఉద్దేశించిన హిమాలయ లివ్.52 ప్రోటెక్ లిక్విడ్ వెటర్నరీ ఫీడ్ సప్లిమెంట్ ను పెద్ద క్యాన్ల నుంచి తీసి, 60 మిల్లీలీటర్లు, 100 మిల్లీలీటర్ల చిన్న సీసాల్లో నింపినట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. అనంతరం వాటిపై పిల్లల కోసం విక్రయించే ఉత్పత్తి అయిన హిమాలయ లివ్.52 డ్రాప్స్ పేరుతో నకిలీ లేబుళ్లు అతికించినట్లు ఆరోపించారు. ఇలా అసలు ఉత్పత్తిని వేరే పేరుతో చెలామణి చేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ సీసాలను అసలు ధరకు దాదాపు రెట్టింపు ధరకు విక్రయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా రూ.31,195 విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 123, 125, 336, 278 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో మందులు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే మందుల విషయంలో వైద్యుల సూచనలను పాటించాలని, సీసాపై ఉన్న పేరు, తయారీదారు వివరాలు, లేబుల్‌ను పరిశీలించాలని తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న మందులను పిల్లలకు ఇవ్వకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన ఉత్పత్తిని కొనుగోలు చేసి, దానిని ఉపయోగించిన తర్వాత అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.