మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది.
మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. మహిళా రిజర్వేషన్ల అమలుపై తమ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేశారు.
మహిళా కోటా అమలుకు సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. డిసెంబర్ 3న ఉభయ సభల సమావేశాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల భేటీలో రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ (రెండో) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ బిల్లుల విషయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. గతంలో బిల్లును వ్యతిరేకించడానికి తాము లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను కొత్త ప్రతిపాదనలో లిఖితపూర్వకంగా చేర్చారని స్టాలిన్ వెల్లడించారు. 1971 జనాభా ప్రాతిపదికనే అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచాలనే ప్రతిపాదన తమ పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు.
డీఎంకే మద్దతుతో పార్లమెంటులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మరింత బలం చేకూరనుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూడా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇండియా కూటమి నేతల సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఈ బిల్లు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. అందుకే తమ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.