MPTC-ZPTC: ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్ నమోదైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఇన్నాళ్లూ ఓటర్ల చుట్టూ తిరిగారు.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.. హామీల వర్షం కురిపించారు. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థులు చేసిన ప్రయత్నాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎవరి మాటకు ఓటర్లు విలువిచ్చారు? ఎవరికి విజయాన్ని కట్టబెట్టారు? ఎవరి ఆశలు ఆవిరి కానున్నాయి? అనే ఉత్కంఠకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ప్రచారం, పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే పడింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 365 కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే తొలి ఫలితం వెలువడేందుకు కనీసం నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద రాజకీయ సందడి మొదలుకానుంది.
ఈ పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఐదు మండలాల్లోనూ పోలింగ్ పూర్తయింది. మరో మూడు జిల్లాల్లో వివిధ కారణాలతో తిరిగి పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మొత్తంగా ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఇప్పుడు ఆ తీర్పు ఎవరి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 30 వేల మందికి పైగా సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బంది, సహాయకులకు బాధ్యతలు అప్పగించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మరోవైపు అభ్యర్థుల గుండెల్లో మాత్రం ఉత్కంఠ మొదలైంది. ప్రచార సమయంలో తమకు అనుకూలంగా కనిపించిన పరిస్థితులు ఓట్ల రూపంలో ఎంతవరకు మారాయోనని లెక్కలు వేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నేతలు కూడా తమ అభ్యర్థుల విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండటంతో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగనుంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో పరిషత్ ఎన్నికల అసలు ఫలితం బయటపడనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? ఏ పార్టీకి పైచేయి దక్కనుంది? ఎవరి అంచనాలు నిజం కానున్నాయి? అన్నది తేలిపోనుంది. ఇన్నాళ్లూ సాగిన రాజకీయ పోరుకు ఇప్పుడు ఓట్ల లెక్కింపుతో ముగింపు పలకనున్నారు.