వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

క్రీడలు | రచన: Kalyan |

Cricket News: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. కెప్టెన్ కూల్ పేరిట ఉన్న ఈ రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యమేనా..!

Ms Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికారు. 2008లో ప్రారంభమైన ఆయన ఐపీఎల్ కెరీర్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించారు. 2027 సీజన్ నుంచి సీఎస్కేకు మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశారు. దాదాపు 18 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దిగ్గజ ఆటగాడు తాజాగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. 2008లో ప్రారంభమైన ఆయన ఐపీఎల్ ప్రయాణం 2025 సీజన్‌తో ఆటగాడిగా ముగిసింది. 2026 సీజన్‌లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీ రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో పాటు.. 2027 సీజన్ నుంచి ఆయన జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దీంతో మైదానంలో ధోనీ ఆటను చూడలేమనే వార్త అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. 2008లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ధోనీ.. తన నాయకత్వంతో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపారు. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో సీఎస్కేకు ఐదు ట్రోఫీలు అందించారు. ఐపీఎల్‌లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించారు. కెప్టెన్‌గా 226 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 133 విజయాలు అందించారు. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా, అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక వికెట్ కీపింగ్‌లోనూ ధోనీ రికార్డులు అసాధారణం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్‌గా ఆయన నిలిచారు. స్టంప్స్ వెనుక చురుకుదనం, మెరుపు వేగంతో స్టంపింగ్‌లు చేయడంలో ధోనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ కీపర్‌గా 200కు పైగా ఔట్లలో భాగస్వామిగా నిలిచిన ఘనత ఆయన సొంతం. బ్యాటింగ్‌లోనూ కీలక సమయాల్లో జట్టును ఆదుకోవడం, చివరి ఓవర్లలో భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చడం ధోనీ ప్రత్యేకత. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'తలా', 'కెప్టెన్ కూల్' అని పిలుచుకుంటారు. ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికినా ధోనీ ప్రయాణం చెన్నైతో ముగిసిపోలేదు. ఇకపై మెంటార్‌గా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఆటగాడిగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, వేలాది పరుగులు, అద్భుతమైన వికెట్ కీపింగ్ ప్రదర్శనలతో చెరగని ముద్ర వేశారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, జట్టును ముందుండి నడిపించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. రాబోయే రోజుల్లో మైదానంలో పసుపు జెర్సీలో ధోనీ కనిపించకపోయినా.. ఆయన సాధించిన రికార్డులు, చెన్నై జట్టుతో ఆయనకున్న అనుబంధం అభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.