అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మునుగోడుకు చెందిన యువకుడు సాయితేజ మృతి!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సాయితేజ (25) మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుపైకి అకస్మాత్తుగా జింక రావడంతో ప్రమాదం జరిగింది. ఇటీవలే ఉద్యోగం సంపాదించిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఇటీవలే ఉద్యోగం సంపాదించిన యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన ఈదులపల్లి ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ (25). ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో కొంతకాలం క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితమే అతడికి ఉద్యోగం లభించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. కుమారుడు మంచి ఉద్యోగంలో స్థిరపడుతున్నాడని తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు.
అయితే ఇంతలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుపై అకస్మాత్తుగా జింక అడ్డుగా వచ్చింది. దీంతో అతడు ప్రయాణిస్తున్న కారు జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు సైతం ప్రమాదానికి గురైన కారును ఢీకొన్నాయి. ఈ వరుస ఢీకొట్టడంతో సాయితేజకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో సాయితేజ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త మునుగోడులోని అతడి కుటుంబ సభ్యులకు చేరడంతో విషాదం నెలకొంది.
చదువుల కోసం విదేశాలకు వెళ్లి, ఇటీవలే ఉద్యోగం సాధించిన కుమారుడు ఇక లేడనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికులు, బంధువులు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాయితేజ భౌతికకాయం ఆదివారం రాత్రికి మునుగోడుకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. యువకుడి మృతితో మునుగోడు పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.