Murasu Cyclone: తీరం దాటిన మురసు తుపాను.. అర్ధరాత్రి నుంచి బీభత్సం.. ఏపీలో ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం!
మురసు తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు బలమైన ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్ర తుపానుగా మారిన మురసు మంగళవారం తెల్లవారుజామున దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. నెల్లూరు, నరసాపురం మధ్య ఒంగోలుకు సమీపంలో నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు నమోదైంది.
తుపాను ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి ప్రాంతాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. విజయవాడలో కురిసిన వర్షాలకు బందర్ రోడ్డు, పాలిక్లినిక్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు సమాచారం. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు తుపాను తీరం దాటినంత మాత్రాన ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు కాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను ప్రభావంతో మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రామాయపట్నం నుంచి వాడరేవు వరకు సముద్రంలో భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని, నవంబర్ 3వ తేదీ ఉదయం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు బీచ్‌లకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ చర్యలపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తమిళనాడు నుంచి 500 మంది విద్యుత్ సిబ్బందిని 25 బృందాలుగా పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం 90 మంది సభ్యులతో కూడిన మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయం అందించడం, రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం వంటి చర్యలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.