Nara Lokesh: జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.. పులివెందుల ఎన్నికలపై సంచలన సవాల్..!
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న వైఎస్ జగన్ ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలో వైసీపీ ఏకగ్రీవ విజయాలు ఎలా సాధించిందని ప్రశ్నించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ విమర్శలను ఖండిస్తూ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవ విజయాలు ఎలా సాధించిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా అప్పట్లో ఎన్నికలు ఎలా జరిగాయో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తోందని లోకేశ్ స్పష్టం చేశారు. నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులను ఎవరూ అడ్డుకోవడం లేదని, అవసరమైన వారికి పోలీసు రక్షణ కూడా కల్పిస్తున్నామని తెలిపారు. మరోవైపు వైసీపీ నాయకులే ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆరోపించారు. వాహనాలకు నిప్పు పెట్టడం, ప్రజలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడి, వాటిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పులివెందులలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు.
బెంగళూరు నుంచి వచ్చి స్థానికంగా గొడవలు సృష్టించి, ఆ తర్వాత బాధితుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్‌పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా జగన్ ఉల్లంఘించారని, అనుమతించిన పరిమితులను మించి రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రజలతో మాట్లాడారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వద్ద తన అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ జగన్ దానిని వినియోగించుకోలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను ఒకసారి గుర్తు చేసుకోవాలని లోకేశ్ సూచించారు. అప్పట్లో పులివెందులలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తూ, ప్రజలు తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. మొత్తంగా పులివెందుల ఎన్నికలపై జగన్ చేసిన ఆరోపణలకు లోకేశ్ ఇచ్చిన సమాధానం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.