నవరాత్రుల్లో అఖండ జ్యోతి ఆరిపోతే ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు.. ఇలా చేయండి!
నవరాత్రుల్లో అఖండ జ్యోతి వెలిగించడం పవిత్రమైన ఆచారంగా భక్తులు భావిస్తారు. అయితే గాలి, నూనె లేదా నెయ్యి తగ్గడం వంటి కారణాలతో దీపం ఆరిపోతే భయపడాల్సిన అవసరం లేదు. దీపాన్ని తిరిగి వెలిగించి అమ్మవారిని ప్రార్థించవచ్చు. అఖండ జ్యోతిని వెలిగించే సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
శారదీయ నవరాత్రులు అంటే అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజులు. ఈ తొమ్మిది రోజుల పాటు చాలామంది ఇళ్లలో దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజించడంతో పాటు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. నవరాత్రుల ప్రారంభంలో వెలిగించే ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుగుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. భక్తి, విశ్వాసం, సానుకూలతకు అఖండ జ్యోతి ప్రతీకగా భావిస్తారు.
అయితే కొన్నిసార్లు గాలి కారణంగా, నూనె లేదా నెయ్యి సరిపోకపోవడం వల్ల, వత్తి సరిగా లేకపోవడం వల్ల దీపం అనుకోకుండా ఆరిపోవచ్చు. దీంతో కొందరు భక్తులు ఇది అశుభానికి సంకేతమా అని ఆందోళన చెందుతారు. అయితే ఇలా జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక మార్గదర్శకాలు చెబుతున్నాయి.
అఖండ జ్యోతి ఆరిపోతే ఏం చేయాలి?
ముందుగా దీపం ఎందుకు ఆరిపోయిందో పరిశీలించాలి. నూనె లేదా నెయ్యి తగ్గిపోయి ఉంటే వాటిని తగినంతగా పోయాలి. వత్తిని సరిచేసి దీపాన్ని మళ్లీ వెలిగించవచ్చు. సంప్రదాయం ప్రకారం ముందుగా చిన్న దీపాన్ని వెలిగించి, ఆ తర్వాత అఖండ జ్యోతిని తిరిగి వెలిగించే పద్ధతిని కొందరు పాటిస్తారు.
దీపం ఆరిపోయినప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, తెలిసీ తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరిన తర్వాత మళ్లీ జ్యోతిని వెలిగించవచ్చని విశ్వాసం. అనంతరం కర్పూర హారతి ఇచ్చి అమ్మవారిని ప్రార్థించడం కూడా కొందరు ఆచరిస్తారు.
జాగ్రత్తలు తప్పనిసరి: అఖండ జ్యోతిని కర్టెన్లు, దుస్తులు, కాగితాలు వంటి మండే వస్తువులకు దూరంగా ఉంచాలి. పిల్లలకు అందకుండా చూసుకోవాలి. నూనె లేదా నెయ్యి స్థాయిని ఎప్పటికప్పుడు గమనించాలి. ముఖ్యంగా దీపాన్ని నిరంతరం వెలిగించి ఉంచాలనే ఉద్దేశంతో భద్రతను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
గమనిక: ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాత్రమే. అఖండ జ్యోతి ఆరిపోవడం వల్ల తప్పనిసరిగా అశుభం జరుగుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ లేదు.