నేపాల్‌లో భూకంపం.. ఉత్తర బెంగాల్, సిక్కింలో ప్రకంపనలు!
నేపాల్‌లో నవంబర్ 24న ఉదయం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఉత్తర బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు.
నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో భారత్‌లోని ఉత్తర బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నవంబర్ 24న ఉదయం సుమారు 7:02 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది.
నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో లెలెప్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. భూకంప కేంద్రాన్ని 27.855 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87.909 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద గుర్తించారు. భూమికి సుమారు 20 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. అయితే యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) మాత్రం భూకంప తీవ్రత 5.3గా, లోతు 10 కిలోమీటర్లుగా నమోదు చేసింది.
ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, జల్‌పైగురి, అలీపుర్‌దువార్, కూచ్‌బెహార్ ప్రాంతాలతో పాటు సిక్కింలోనూ అనుభూతి చెందినట్లు సమాచారం. నేపాల్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు నమోదైనట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భవనాలు కంపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.