వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

అంతర్జాతీయం | రచన: Kalyan |

Amazing News: షెడ్డులో దొరికిన పాత రేకు డబ్బా.. అందులో భర్త దాచిన నిధి.. భార్యకు జాక్‌పాట్..!

Amazing News

ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లోని పాత షెడ్డును శుభ్రం చేస్తుండగా రేకు బిస్కెట్ డబ్బా కనిపించింది. అందులో ఉన్న వెండి నాణేల కింద 1975లో ఆమె భర్త దాచిన 62 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని వేలం వేయగా 1,13,000 పౌండ్లు (సుమారు రూ.1.25 కోట్లు) లభించాయి. భర్త దాచిన సంపద దశాబ్దాల తర్వాత ఆమెకు అనుకోని అదృష్టంగా మారింది.

జీవితంలో అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు మన కళ్ల ముందే ఉన్న వస్తువుల్లోనే ఊహించని సంపద దాగి ఉంటుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ జీవితంలోనూ ఇలాంటి ఆసక్తికర సంఘటనే జరిగింది. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె.. ఇంట్లోని పాత సామాన్లు శుభ్రం చేస్తుండగా ఓ రేకు బిస్కెట్ డబ్బా కనిపించింది. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో తెరిచి చూడగా.. చివరకు ఆమెకు ఏకంగా రూ.1.25 కోట్లకు పైగా సంపద దక్కింది. ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలోని పెన్జాన్స్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త మరణించిన తర్వాత ఆ మహిళ కుటుంబ ఖర్చుల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఒకరోజు ఇంటి పెరట్లో ఉన్న పాత స్టోర్ రూమ్, షెడ్డును శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ పేరుకుపోయిన పాత వస్తువులను బయటకు తీస్తుండగా దుమ్ముపట్టిన ఓ రేకు బిస్కెట్ డబ్బా కనిపించింది. దానిని తెరిచి చూడగా కొన్ని చిల్లర వస్తువులతో పాటు పాత వెండి నాణేలు కనిపించాయి. ఆ నాణేలు సాధారణమైనవేనా? వాటికి ఏమైనా విలువ ఉందా? అని తెలుసుకోవాలనుకున్న ఆమె.. వెంటనే వాటిని లేస్ ఆక్షనీర్స్ అనే వేలం సంస్థ వద్దకు తీసుకెళ్లింది. మొదట ఆ డబ్బాలో ఉన్నవి సాధారణ పాత వస్తువులేనని భావించిన వేలం సిబ్బంది.. దానిని పూర్తిగా పరిశీలించడం ప్రారంభించారు. అయితే, పైభాగంలో కనిపించిన వెండి నాణేలను పక్కకు తీసి చూడగానే వారికి ఊహించని విషయం తెలిసింది. వాటి కింద అసలైన మింట్ ప్యాకేజింగ్‌లో భద్రపరిచిన 62 స్వచ్ఛమైన బంగారు నాణేలు కనిపించాయి. ఇన్నేళ్లుగా ఆ బంగారం ఎవరి కంటా పడకుండా అదే డబ్బాలో ఉండిపోయింది. అయితే ఈ బంగారు నాణేలు అక్కడికి ఎలా వచ్చాయన్నదే అసలు ఆసక్తికరమైన విషయం. 1975లో బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆ మహిళ భర్త భవిష్యత్తు అవసరాల కోసం ఈ నాణేలను కొనుగోలు చేశారట. అప్పట్లో ఒక్కో నాణేన్ని సుమారు 70 నుంచి 80 పౌండ్లకు కొనుగోలు చేసి, ఎవరికీ తెలియకుండా బిస్కెట్ డబ్బాలో భద్రపరిచారట. ఆ తర్వాత కాలక్రమేణా ఆ విషయం మరుగునపడిపోయింది. చివరకు ఆయన మరణించిన ఎన్నో ఏళ్ల తర్వాత ఆ నిధి భార్యకు అనుకోకుండా దొరికింది. ఇక ఆ 62 బంగారు నాణేలను వేలం వేయగా కొనుగోలుదారుల నుంచి భారీ పోటీ నెలకొంది. చివరకు మొత్తం నాణేలు కలిపి ఏకంగా 1,13,000 బ్రిటిష్ పౌండ్లకు అమ్ముడుపోయాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.1.25 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. భర్త దశాబ్దాల క్రితం భవిష్యత్తు కోసం దాచిన బంగారం.. ఇప్పుడు భార్య కష్టకాలంలో అండగా నిలిచింది. ఇంట్లోని పాత సామాన్లను శుభ్రం చేయడం కోసం మొదలైన పని.. చివరకు ఆమె జీవితంలోనే మరిచిపోలేని అదృష్టంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వింతైన ఘటన సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.