వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Pallavi |

కోనసీమలో ONGC బావి వద్ద భారీ గ్యాస్ లీక్.. మంటలు వ్యాపించడంతో గ్రామాల్లో భయాందోళనలు!

భారీ గ్యాస్ లీక్..

కోనసీమ జిల్లాలోని ONGC బావి వద్ద భారీ గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ONGC బావి వద్ద భారీ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. రజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న మోరి-5 బావి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకైన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోరి-5 బావిలో ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోవడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో వర్కోవర్ రిగ్ సహాయంతో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గ్యాస్, ముడి చమురు మిశ్రమం భారీగా బయటకు ఎగసిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిసేపటికే లీకైన గ్యాస్‌కు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా అగ్నికీలలు, దట్టమైన పొగతో నిండిపోయింది. సమీపంలోని కొబ్బరి చెట్లకు కూడా మంటలు వ్యాపించినట్లు సమాచారం. గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఇరుసుమండ, లక్కవరం గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయవద్దని, పొయ్యిలు వెలిగించవద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమికంగా ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ONGC అత్యవసర బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. బావి వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు ప్రత్యేక నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు ONGC వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై ఆరా తీసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు.