అర్నబ్ తుఫానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. సాయంత్రంలోపే ఆ పని పూర్తి చేయాలని ఆదేశం..!
అర్నబ్ తుఫాను నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, 92 ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అర్నబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను సన్నద్ధతపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 92 ఆవాసాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలను తరలించిన తర్వాత పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, బాధితులకు భోజనం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో ఏలేరు వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా, రహదారులు, తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. తుఫాను సమయంలో ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.