వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Pawan Kalyan: అడవిలో వేటగాళ్ల వల.. 69 ఉచ్చులు బయటపడ్డాయి.. పవన్ కల్యాణ్ సీరియస్..!

Pawan Kalyan

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో వన్యప్రాణులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 69 ఉచ్చులు బయటపడ్డాయి. మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో తయారు చేసిన ఈ ఉచ్చులను అధికారులు తొలగించారు. అటవీ సిబ్బంది అప్రమత్తతను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అడవుల్లో గస్తీని మరింత పెంచాలని, బ్రేక్ వైర్ల దుర్వినియోగంపై మెకానిక్‌లు, ఆటోమొబైల్ షాపుల యజమానులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.

అడవుల్లో వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న అక్రమ వేటను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అప్రమత్తమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్వహించిన ప్రత్యేక గస్తీలో ఏకంగా 69 వేట ఉచ్చులు బయటపడటం కలకలం రేపింది. మూడు చక్రాల వాహనాలకు ఉపయోగించే బ్రేక్ వైర్లతో తయారు చేసిన ఈ ఉచ్చులను అటవీ అధికారులు గుర్తించి తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. అటవీ ప్రాంతాల్లో నిఘా, పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4 పరిధిలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో వన్యప్రాణులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించారు. బ్రేక్ వైర్లతో అమర్చిన ఈ ఉచ్చులు జంతువులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండటంతో వెంటనే వాటిని తొలగించి ముప్పును నివారించారు. ఈ ఆపరేషన్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది పనితీరును పవన్ కల్యాణ్ అభినందించారు. అడవుల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, వేటగాళ్ల ఉచ్చులను గుర్తించి తొలగించడం ద్వారా ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను కాపాడుతున్నారని ప్రశంసించారు. వన్యప్రాణుల సంరక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అధికారులు మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. మరోవైపు బ్రేక్ వైర్లను ఉపయోగించి వేట ఉచ్చులు తయారు చేస్తున్న నేపథ్యంలో వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడంపైనా పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు ఈ అంశంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అడవుల్లో ప్రతి ఉచ్చు వన్యప్రాణి ప్రాణానికి ముప్పుగా మారుతుందని, అక్రమ వేటను అరికట్టేందుకు నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ కొనసాగించాలని స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.