వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవా..? కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Petrol Diesel Prices

పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. చమురు సరఫరాలో అంతరాయాలు, ఆయిల్ కంపెనీలకు సుమారు రూ.42 వేల కోట్ల నష్టాలు ఉన్నాయని తెలిపారు.

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఇంధన ధరలు తగ్గించే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులే కాకుండా చమురు సంస్థల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని మీనాంబాక్కమ్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన సురేశ్ గోపీ.. ప్రస్తుతం చమురు సరఫరాలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇంధన సరఫరాపైనా పడుతోందని చెప్పారు. ఈ పరిణామాల కారణంగా చమురు సంస్థలు ఇప్పటికే సుమారు రూ.42 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించడం సాంకేతికంగా సాధ్యం కాదని స్పష్టం చేశారు. ధరలు తగ్గితే బాగుంటుందని ప్రజలు ఆశించడం సహజమేనని, అయితే చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. కంపెనీలకు జరిగిన నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు పెట్రోల్‌పై విధించే రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను తగ్గించడం ద్వారా వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించే అవకాశం ఉందని సూచించారు. కేరళ, కర్ణాటకలో ఇంధన ధరలు పెరిగిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు భారంగా మారాయి. నవంబర్ 17 నాటికి నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.15గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.23గా నమోదైంది. ప్రస్తుతం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి తాజా వ్యాఖ్యలతో తక్షణ ధరల తగ్గింపుపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైనట్లయింది.