Pm Surya Ghar: కరెంటు బిల్లు తగ్గించుకోవాలా.. సోలార్ ప్యానెల్స్‌పై రూ.78 వేల సబ్సిడీ.. ఇంకా ఎన్నిరోజులే ఛాన్స్ అంటే..!
ప్రతి నెలా ఇంటికి వచ్చే కరెంటు బిల్లు చూసి ఆందోళన చెందుతున్నారా? విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక పథకం ఉంది.
ప్రతి నెలా ఇంటికి వచ్చే కరెంటు బిల్లు చూసి ఆందోళన చెందుతున్నారా? విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక పథకం ఉంది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అర్హులైన కుటుంబాలకు భారీగా సబ్సిడీ అందిస్తోంది. అదే పీఎం సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన. అయితే ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి గడువు కూడా ఉంది. 2027 మార్చి 31తో ఈ పథకం ముగియనుండటంతో అర్హులైన కుటుంబాలకు ఇంకా 152 రోజుల సమయం మాత్రమే ఉంది.
2026 అక్టోబర్ 28 నాటికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 64,58,706 కుటుంబాలు ప్రయోజనం పొందాయి. మొత్తం 94,58,890 దరఖాస్తులు రాగా.. 54,59,383 ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ గణాంకాలు పథకానికి లభిస్తున్న స్పందనను తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన కుటుంబాలు తమకు ఈ పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకుని వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించడం మంచిది. అయితే దరఖాస్తు చేసిన వెంటనే సబ్సిడీ అందదు. సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రారంభించి, తనిఖీ చేసిన తర్వాతే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తుంది. ఇన్స్టాలేషన్, డిస్కమ్ అనుమతులు, నెట్ మీటరింగ్ వంటి అంశాల వల్ల ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చని సోలార్ సొల్యూషన్స్ సంస్థ ఫ్రయర్ ఎనర్జీ కో-ఫౌండర్, డైరెక్టర్ రాధికా చౌదరీ న్యూస్18 తెలుగుకు తెలిపారు.
ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అర్హులైన కుటుంబాలకు 1 కిలోవాట్ సోలార్ వ్యవస్థపై రూ.30,000, 2 కిలోవాట్లపై రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థపై గరిష్ఠంగా రూ.78,000 కేంద్ర సబ్సిడీ లభిస్తుంది. ఉదాహరణకు 3 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు ఖర్చు సుమారు రూ.2.30 లక్షల నుంచి రూ.2.40 లక్షల వరకు ఉండవచ్చు. రూ.78 వేల సబ్సిడీని మినహాయిస్తే వినియోగదారుడిపై సుమారు రూ.1.52 లక్షల నుంచి రూ.1.62 లక్షల వరకు ఖర్చు పడుతుంది. అయితే పరికరాలు, ఇంటి పైకప్పు పరిస్థితి, ఇతర అదనపు ఛార్జీలను బట్టి తుది ఖర్చు మారుతుంది. ముందుగా పూర్తి ఖర్చు చెల్లించి, వ్యవస్థ ప్రారంభమైన తర్వాత సబ్సిడీని బ్యాంకు ఖాతాలో పొందాల్సి ఉంటుంది.
మీ ఇంటికి ఎన్ని కిలోవాట్ల సోలార్ వ్యవస్థ అవసరమో నిర్ణయించుకోవడం కూడా ముఖ్యమే. సాధారణంగా నెలకు 0 నుంచి 150 యూనిట్ల విద్యుత్ వినియోగించే కుటుంబాలు 1 నుంచి 2 కిలోవాట్ల వ్యవస్థను పరిశీలించవచ్చు. 150 నుంచి 300 యూనిట్ల వరకు వినియోగించే వారు 2 నుంచి 3 కిలోవాట్ల వ్యవస్థను ఎంచుకోవచ్చు. నెలకు 300 యూనిట్లకు మించి వినియోగించే కుటుంబాలు 3 కిలోవాట్లకు పైగా సామర్థ్యాన్ని పరిశీలించవచ్చు. అయితే విద్యుత్ వినియోగంతో పాటు ఇంటి పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, సాంకేతిక సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో అదనపు ప్రోత్సాహకాలు వర్తించే అవకాశం ఉన్నప్పటికీ, వాటికి ప్రత్యేక అర్హతలు, షరతులు ఉంటాయి. కాబట్టి తాజా అధికారిక మార్గదర్శకాలను పరిశీలించాలి.
వ్యక్తిగత ఇళ్లతో పాటు గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అపార్ట్మెంట్లలో లిఫ్టులు, సాధారణ విద్యుత్ అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వంటి ఉమ్మడి సదుపాయాల కోసం ఏర్పాటు చేసే సోలార్ వ్యవస్థలకు ఒక్కో కిలోవాట్‌కు రూ.18,000 చొప్పున సబ్సిడీ అందించే నిబంధన ఉంది. గరిష్ఠంగా 500 కిలోవాట్ల సామర్థ్యం వరకు ఈ సాయం వర్తిస్తుంది. అయితే ఒక్కో ఇంటికి 3 కిలోవాట్ల చొప్పున సామర్థ్యాన్ని లెక్కిస్తారు. ఇప్పటికే వ్యక్తిగత ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థల సామర్థ్యాన్ని కూడా ఈ లెక్కలో పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ https://pmsuryaghar.gov.in ను సందర్శించవచ్చు. అక్కడ తమ విద్యుత్ కనెక్షన్ వివరాలతో అర్హతను పరిశీలించి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 15555 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. పథకం 2027 మార్చి 31 వరకు కొనసాగనున్న నేపథ్యంలో చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అయితే గడువులోగా సబ్సిడీ పొందాలంటే ఇన్స్టాలేషన్, తనిఖీ వంటి ప్రక్రియలకు కూడా సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.