వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Polavaram: అబ్బురపరుస్తున్న గోదావరి అందాలు.. పోలవరం వద్ద నీలి రంగులో మెరిసిపోతున్న గోదారమ్మ!

Polavaram
అబ్బురపరుస్తున్న గోదావరి అందాలు.. పోలవరం వద్ద నీలి రంగులో మెరిసిపోతున్న గోదారమ్మ! Photo: అబ్బురపరుస్తున్న గోదావరి అందాలు.. పోలవరం వద్ద నీలి రంగులో మెరిసిపోతున్న గోదారమ్మ!

గోదావరి నది అందాలు మరోసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని నెలలుగా వరద ఉద్ధృతితో ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించిన నదీ జలాలు ఇప్పుడు నీలి ఛాయల్లో కనువిందు చేస్తున్నాయి.

గోదావరి నది అందాలు మరోసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని నెలలుగా వరద ఉద్ధృతితో ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించిన నదీ జలాలు ఇప్పుడు నీలి ఛాయల్లో కనువిందు చేస్తున్నాయి. పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో గోదావరి రూపం ఒక్కసారిగా మారడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న పర్యాటకులు ఈ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. వర్షాకాలంలో ఉగ్రరూపంతో కనిపించే గోదావరి.. ఇప్పుడు ప్రశాంతంగా, కొత్త అందాలతో దర్శనమిస్తోంది. జూలై నుంచి అక్టోబరు మొదటి వారం వరకు ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు గోదావరికి వరద ప్రవాహాన్ని పెంచాయి. కొండలు, వాగులు, వంకల నుంచి వచ్చిన నీటితో పాటు పెద్ద మొత్తంలో మట్టి, ఇసుక, ఇతర అవక్షేపాలు నదిలో కలిశాయి. దీంతో పోలవరం స్పిల్‌వే వద్ద నీరు ఎరుపు, రాగి, గోధుమ రంగుల ఛాయల్లో కనిపించింది. వరద ప్రవాహం వేగంగా ఉండటంతో నీటిలోని మట్టి కణాలు ఎక్కువసేపు తేలియాడుతూ నదికి ఆ రంగును తీసుకొచ్చాయి. అయితే అక్టోబరు మధ్య నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ఉద్ధృతి కూడా క్రమంగా తగ్గింది. కొత్తగా నదిలోకి చేరే మట్టి, ఇసుక పరిమాణం తగ్గడంతో నీటిలోని సన్నని కణాలు క్రమంగా అడుగున పేరుకుపోవడం ప్రారంభించాయి. ఫలితంగా నీటిలో మసకదనం తగ్గి, జలాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీలేరు నుంచి గోదావరిలో కలిసే నీటి లక్షణాలు కూడా ఈ రంగు మార్పుపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో భారీ వరదతో ఉధృతంగా కనిపించిన నది, ఇప్పుడు నీలి ఛాయలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. నదిలోని నీటి రంగు అనేది కాంతి, నీటి లోతు, అందులో కలిసిన మట్టి కణాలు, ఇతర పదార్థాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి మారుతుంటుంది. అందువల్ల వరద తగ్గిన తర్వాత గోదావరిలో కనిపిస్తున్న ఈ మార్పు సహజ పరిస్థితులతో ముడిపడి ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా, పోలవరం వద్ద గోదావరి నది చూపిస్తున్న ఈ కొత్త రూపం చూపరులకు కనువిందు చేస్తోంది. కొన్ని నెలల పాటు వరద నీటితో నిండుగా, మట్టి రంగులో కనిపించిన నది.. ఇప్పుడు నీలి ఛాయలతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ దృశ్యాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.