వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

రాజకీయాలు | రచన: Kalyan |

Pulivendula: పులివెందులలో 80 బూత్‌లు.. 70 చోట్ల మా ఏజెంట్లను తరిమేశారు: జగన్ సంచలన ఆరోపణలు!

Pulivendula
Pulivendula Photo: Pulivendula

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని విమర్శించారు.

పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ తీవ్ర రాజకీయ దుమారం రేగింది. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. పట్టణంలో మొత్తం 80 పోలింగ్ బూత్‌లు ఉండగా, 70 బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లను తరిమేశారని ఆరోపించారు. తన ఇల్లు, ఓటు ఉన్న బూత్‌లో మాత్రమే ఏజెంట్లను అనుమతించారని, మిగతా చోట్ల టీడీపీ శ్రేణులకు పోలీసులు సహకరించారని విమర్శించారు. బాధిత ఏజెంట్లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి రీపోలింగ్ కోరతానని స్పష్టం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే బూత్‌లను ఆక్రమించి ఓటర్లను భయపెట్టారని జగన్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై దాడి చేశారని, పోలింగ్ ఏజెంట్ సునంద చేయి విరగ్గొట్టారని ఆరోపించారు. మహిళల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం, దొంగ ఓట్లు వేయడం వంటి ఘటనలు జరిగాయని అన్నారు. ఈ పరిణామాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులు జరిగాయని, కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పులివెందులతో పాటు కడప, జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లోనూ రిగ్గింగ్, దౌర్జన్యాలు జరిగాయని జగన్ ఆరోపించారు. సీసీ కెమెరాలు, లైవ్ ఫుటేజ్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రశ్నించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు తొలుత అనుమతి ఇచ్చి, ప్రయాణంలో ఉండగా నిరాకరించారని కూడా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ కూటమి పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు.