వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

నేర వార్తలు | రచన: Kalyan |

Raptadu: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు షాక్.. కుడికాలు తొలగించాల్సి రావచ్చంటున్న వైద్యులు..!

Raptadu Hemant

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కుడికాలుకు రక్త ప్రసరణ తగ్గిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాలును తొలగించాల్సి రావచ్చని తెలిపారు.

రాప్తాడు పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడి ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తాజా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం హేమంత్ పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. కుడికాలుకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. రక్త సరఫరా ఇదే విధంగా కొనసాగితే ఆ కాలును తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన అనంతరం పోలీసుల కాల్పుల్లో హేమంత్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో అతడిని అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతడు వైద్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడని, తన పేరు అడిగితే హేమంత్ అని చెబుతున్నాడని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే కుడికాలులో రక్త ప్రసరణ తగ్గడంతో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెండు కాళ్లలో బుల్లెట్లు ఉన్నాయనే అనుమానంతో వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రాథమిక ఎక్స్‌రేల్లో బుల్లెట్లు కనిపించలేదని సర్జరీ వైద్యులు వెల్లడించినట్లు డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. ప్రస్తుతం ఎక్స్‌రే నివేదికలను పరిశీలిస్తున్నారు. అనస్తీషియా వైద్యుడు కూడా హేమంత్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆర్థోపెడిక్, న్యూరాలజీ వైద్యులు అందుబాటులో ఉన్న నివేదికలను పరిశీలించి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి హేమంత్ కుడికాలుపైనే ఉంది. ఆ కాలుకు రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందన్న విషయం ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుందని సూపరింటెండెంట్ తెలిపారు. రక్త సరఫరా సరిగా లేకపోతే కండరాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. శస్త్రచికిత్స అనంతరం కాలును కాపాడగలరా? లేక తొలగించాల్సిన పరిస్థితి వస్తుందా? అన్నది తేలనుంది. దీంతో హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి వైద్యుల ప్రకటన కోసం ఆసక్తి నెలకొంది.